న్యాయం మీ చేతుల్లోనే..! | state government ask to special leave on brijesh tribunal report | Sakshi
Sakshi News home page

న్యాయం మీ చేతుల్లోనే..!

Published Thu, Dec 15 2016 3:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

న్యాయం మీ చేతుల్లోనే..! - Sakshi

న్యాయం మీ చేతుల్లోనే..!

కృష్ణా జలవివాదంపై సుప్రీం తలుపు తట్టిన రాష్ట్రం
బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు
తీర్పుపై స్టే ఇచ్చి నీటిని నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాలని విజ్ఞప్తి
కృష్ణా బేసిన్లో 65 శాతం తెలంగాణలోనే.. కేటాయింపులేమో 37 శాతమే
31 శాతం బేసిన్‌ ఉన్న ఏపీకేమో ఏకంగా 63 శాతం కేటాయింపులా?


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పు న్యాయ సమ్మతంగా లేదని అందులో అభిప్రాయపడింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా లేనందున వాటిని అమలు చేయకుండా స్టే ఇవ్యాలని కోర్టును కోరింది. కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలన్నింటినీ ఒకే  యూనిట్‌’ గా పరిగణించాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే రీతిన నీటి కేటాయింపులు చేసి న్యాయం చేయాలని విన్నవించింది. ‘‘కృష్ణా బేసిన్‌లో 68.5 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం 36.9 శాతమే! అదే 31.5 శాతం పరివాహక ప్రాంతమున్న ఏపీకి మాత్రం 63.1 శాతం కేటాయింపులు న్నాయి.

పైగా వీటిలోనూ ఏపీ తనకు కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను తన బేసిన్‌ బయటే వాడుకుం టోంది’’ అని ఆక్షేపించింది. అంతేగాకుండా, ‘‘కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 37.11లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమి ఉంటే ఏపీకి కేవలం 16.03 లక్షల హెక్టార్లే ఉంది. అయినా కేటాయింపులు మాత్రం వారికే ఎక్కువగా ఉన్నాయి. జనాభాపరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9 శాతం) నివసిస్తుంటే ఏపీలో కేవలం 78.29 లక్షల మందే (28.1 శాతం) ఉంటున్నారు’’ అని వివరించింది. వీటన్నింటి దృష్ట్యా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని కోరింది.

అశాస్త్రీయంగా పంపకం
ఇక అశాస్త్రీయమైన కేటాయింపుల కారణంగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీళ్లు రావని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అందుకే వివాదాన్ని తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయకుండా నాలుగు రాష్ట్రాల మధ్య న్యాయబద్ధమైన పంపిణీ జరగాలని కోరింది. నదీ పరివాహక ప్రాంతం, సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టువారీ కేటాయింపులు చేయాలని కోరింది. సాగునీటి రంగంలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసింది.

కృష్ణా బేసిన్‌ పరిధిలోని కరువు ప్రాంతాలైన మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ (రంగారెడ్డి), నల్లగొండ జిల్లాలకు వేరే నీటి వనరేమీ లేదని, అప్పటికే మొదలైన ప్రాజెక్టులు మైసూర్‌ రాష్ట్రం (కర్ణాటక) పరిధిలోకి పోవడం వల్ల ఆ జిల్లాలు మరింతగా నష్టపోయాయని తెలంగాణ వివరించింది. ఈ విషయాన్ని బచావత్‌ ట్రిబ్యూనలే తన నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. కృష్ణా బేసిన్లోని మహబూబ్‌ నగర్‌ జిల్లాకు 170 టీఎంసీల సాగునీరందించే ప్రాజెక్టులు కోల్పోయామని వివరించింది.

నిజానికి విభజన చట్టం సెక్షన్‌ 89 ఎ, బిలకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటా యింపులెలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు ఏం చేయాలన్నది బ్రిజేశ్‌ ట్రిబ్యునలే నిర్ణయించాల్సి ఉన్నా విఫలమైందని ప్రభుత్వం ఆక్షేపించింది. ‘‘లోటున్నప్పుడు దిగువ రాష్ట్రాలు పూర్తిగా ఎగువ ప్రవాహాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. దిగువ రాష్ట్రాలకు ప్రాజెక్టులవారీగా, ఎగువ రాష్ట్రాలకు గుండుగుత్త (ఎన్‌బ్లాక్‌)గా కేటాయింపులు చేస్తే పై రాష్ట్రాలు వాటి వాటా నీటిని వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టులు కట్టుకునే అవకాశముంటుంది. ఈ కీలక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో ట్రిబ్యునల్‌ విఫలమైంది’’ అని పేర్కొంది. ఇదే సమయంలో నదీ బేసిన్‌ అంతా ఒకే యూనిట్‌గా ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలను కాదని, రెండు రాష్ట్రాలకే తాజా పంపకాలను పరిమితం చేస్తామనడం కూడా న్యాయబద్ధం కాదని కోర్టు దృష్టికి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement