ఐటీ అంచనాలు పెంచుతున్న రూపీ
ముంబై: రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయ ఐటీ కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో డాలరుతో రూపాయి విలువ 11 శాతం క్షీణించడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకొని ఔట్ సోర్సింగ్ ఆర్డర్లు కూడా పెరుగుతుండటం ఐటీ రంగానికి కలిసొస్తున్న అంశంగా వీరు పేర్కొంటున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన ఐటీ కంపెనీల ఆదాయాల్లో 2.5 శాతం నుంచి 4 శాతం వృద్ధి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో ఇప్పుడందరి దృష్టీ అక్టోబర్ 11న విడుదలయ్యే ఇన్ఫోసిస్ ఫలితాలపైనే ఉంది. కొన్ని కంపెనీల్లో జీతాలు పెంచాల్సి వచ్చినప్పటికీ రూపాయి క్షీణత వలన క్యూ2లో ఐటీ కంపెనీల మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూపు హెడ్ డిపెన్ షా పేర్కొన్నారు. రూపాయి విలువ ఒక శాతం క్షీణిస్తే ఎగుమతి చేసే ఐటీ కంపెనీల మార్జిన్లు 30 నుంచి 35 బేసిస్ పాయింట్లు పెరుగుతాయన్నది అంచనా. దీంతో రూపాయల్లో చూస్తే ఐటీ కంపెనీల ఆదాయాల్లో 13.5 శాతం నుంచి 16.5 శాతం వృద్ధిని ఏంజల్ బ్రోకింగ్ అంచనా వేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగు కావడం, ఆర్డర్లు పెరగడంతో క్యూ2 ఫలితాలు బాగుంటాయని ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేస్తోంది.
బ్యాంకులపై ఎన్‌పీఏ ఒత్తిడి
బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న వడ్డీరేట్లు, నిరర్థక ఆస్తులు వంటివన్నీ బ్యాంకింగ్ రంగ ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండో త్రైమాసికంలో కూడా బ్యాంకులు పెరిగిన నిరర్థక ఆస్తులకు అనుగుణంగా ప్రొవిజనింగ్ కేటాయింపులు పెంచాల్సి రావడంతో ఆ మేరకు లాభాలపై ఒత్తిడి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. గడచిన ఏడాది ఇదే కాలానికి ఈ విలువ 3.4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధనం కోసం రూ.14,000 కోట్లు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.