ప్రధాని జోక్యం చేసుకోవాలి! | Subramanian Swamy to help suspended Kriti Azad draft reply to BJP | Sakshi
Sakshi News home page

ప్రధాని జోక్యం చేసుకోవాలి!

Published Fri, Dec 25 2015 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

ప్రధాని జోక్యం చేసుకోవాలి! - Sakshi

ప్రధాని జోక్యం చేసుకోవాలి!

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: తన సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని బహిష్కృత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ప్రధానిని కోరారు. మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి, తన తప్పేంటో చెప్పాలని, పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారహితంగా తానేం చేశాడో స్పష్టంగా చెప్పాలన్నారు. డీడీసీఏలో అవినీతి బీసీసీఐకి సంబంధించిన అంశమే కానీ పార్టీకి సంబంధించినది కాదని పేర్కొన్నారు. అహ్మదాబాద్ వచ్చిన ఆజాద్ గురువారం విలేకరులతో మాట్లాడారు.

ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ ప్రజా శ్రేయో వ్యాజ్యం వేస్తానన్నారు. ‘అప్పుడు అంతా కష్టాల్లో పడతారు’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసిన ‘ఓటమిని అంగీకరించను’ అనే ప్రఖ్యాత కవితను ఉటంకించారు. సీబీఐ నుంచి నోటీసులందగానే సంబంధిత పత్రాలను మాయం చేస్తున్నారని ఆరోపించారు.
 
వెటరన్స్ భేటీ: ఆజాద్‌పై వేటు నేపథ్యంలో.. బీజేపీ మార్గదర్శక మండలి నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆజాద్ తొలగింపు, పార్టీ వ్యవహారాలను వారు చర్చించారు. ఆజాద్‌ను పిలిపించి చర్చించాలని నిర్ణయించారు.
 
ఢిల్లీ సీఎం దిగజారి మాట్లాడుతున్నారు.
ప్రసంగాల స్థాయిని దిగజారుస్తున్నారంటూ కేజ్రీవాల్, ఆప్ పార్టీలపై జైట్లీ ధ్వజమెత్తారు. అసభ్యంగా మాట్లాడటం తమ హక్కు అని పదవుల్లో ఉన్నవారు భావించకూడదన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలవడం తో.. సభ్యత లేకుండా మాట్లాడితే ఓట్లు పడతాయని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఉందని ఫేస్‌బుక్ వేదికగా ఒకరు అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిచ్చారు.
 
దర్యాప్తునకు ఆదేశించండి: రాహుల్
లక్నో: ప్రధాని  మోదీపై విమర్శల స్వరాన్ని మరింత పెంచారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రెండు రోజుల అమేథీ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగి వచ్చిన రాహుల్  గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ‘తాను అవినీతికి పాల్పడనని, మరెవరినీ పాల్పడనివ్వనంటూ ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా క్రికెట్ కుంభకోణం. దీని గురించి మాట్లాడినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. అయినా ప్రధాని మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం మొదలైంద’న్నారు. పదమూడు సంవత్సరాలపాటు జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న  డీడీసీఏ వ్యవహారాలపై  ప్రధాని దర్యాప్తునకు ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement