ఒక తల్లి క్షమాపణ
భారత మూలాలున్న బ్రిటిష్ పౌరురాలు సుజాతా సేతియా(35) తన కూతురికి క్షమాపణలు చెబుతూ చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలు పిల్లలే వద్దనుకున్న సుజాత కూతురు పుట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది. ఏ దశలోనూ ఆ చిన్నారిని ప్రేమించలేదని ఒకప్పటి తన సంకుచిత బుద్ధిని మొహమాటంలేకుండా వెల్లడించిదా తల్లి.
కెంట్(బ్రిటన్)లోని డార్ట్ ఫోర్డ్లో నివసించే సుజాత తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసింది.. 'నేను పిల్లల్ని కనాలని అస్సలు అనుకోలేదు. మూడేళ్ల కిందట అయాత్ పుట్టినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఆపలేని ఆమె పుట్టుక నన్ను డిప్రెషన్ లోకి నెట్టేసింది. సుదీర్ఘకాలం ఆ ఒత్తిడిలోనే ఉండిపోయా. ఇష్టం లేనిదాన్ని ప్రేమించడం ఎవరికైనా కష్టమే కదా! కాలం తన పని తాను చేసుకుపోయింది..
ఈ మధ్యే ఫ్యామిలీ మొత్తం చిన్న ట్రిప్ కి వెళ్లాం. నా జీవితాన్ని మార్చేసిన ఆ పర్యటనలో మొల్లగా నాక్కొన్ని విషయాలు అర్థమయ్యాయి. మొదటిది నేను ప్రేమించకుంన్నా నా మీద ఆధారపడటం ద్వారా తను నా ప్రేమను పొందగలిగింది. అంటే నేను ఆమెను ప్రేమించడంలేదన్నది నిజంకాదు. నా కూతురంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందని తెలుసుకున్నాను. ఇన్నాళ్లూ ఒక వెర్రి భ్రమలో బతికినందుకు నన్ను నేను నిందించుకున్నా. క్షమాపణగా ఆమె బాల్యానికి సంబంధించిన అద్భుతం ఏదైనా ఇవ్వాలనుకున్నా. అందుబాటులో ఉన్న కెమెరాతో నా కూతురు అయాత్ ఫొటోలు తీశా. ఇవి కేవలం ఫొటోలేకాదు నా క్షమాపణా పత్రాలు కూడా..