న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలోని ఓ పురాతన కోట శిథిలాల కింద భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) బంగారం కోసం కొనసాగిస్తున్న వేట సోమవారం నాలుగోరోజూ కొనసాగింది. మరోవైపు ఈ తవ్వకాల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించింది. ఊహాజనితమైన అంశాల ఆధారంగా ఈ కేసులో తామెలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగొయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు పేర్కొంది.
వెయ్యి టన్నుల బంగారం కంటే విలువైన రాష్ట్ర చారిత్రక ప్రదేశాలను వెలికితీయాలనే విజ్ఞప్తిని ఏఎస్‌ఐ పెడచెవిన పెట్టిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సోమవారం పాట్నాలో ధ్వజమెత్తారు. మరోవైపు ఏఎస్‌ఐ తవ్వకాలను నిన్నటిదాకా ఎద్దేవా చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పుడు మాట మార్చారు. బంగారం గనుల కల గన్న సాధువు శోభన్ సర్కార్ నిరాడంబరత, త్యాగాలకు తాను ప్రణమిల్లుతున్నట్లు సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.