ముఖేష్ - పవన్
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఇద్దరి ఉరిశిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నలుగురు దోషులు ముఖేష్ (26), అక్షయ్ ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్ శర్మ (20) హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఆ నలుగురు చేసిన నేరం అత్యంత అరుదైనదిగా భావించిన ధర్మాసనం.. మహిళలపై ఘోరమైన నేరాల్లో అనుసరించదగ్గ శిక్ష వేయాలని అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పును ముఖేష్, పవన్ల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దాంతో ముఖేష్, పవన్ల ఉరిశిక్షపై మార్చి 31 వరకు సుప్రీం కోర్టు స్టే విధించింది. అప్పీలు పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.