
ఫాదర్ థామస్ ను సురక్షితంగా విడిపిస్తాం!
యెమన్ లో అపహరణకు గురైన భారతీయ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ ను సురక్షితంగా విడిపించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. యెమన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన తనను విడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫాదర్ థామస్ ఉజన్నాలిల్ ఓ వీడియో సందేశంలో పోప్ ఫ్రాన్సిస్ ను, భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వీడియో సందేశంపై సుష్మా మంగళవారం ట్విట్టర్ లో స్పందించారు.
ఫాదర్ థామస్ భారతీయుడని, ప్రతి భారతీయుడి ప్రాణం తమకు విలువైనదని, ఆయనను విడిపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని సుష్మా ట్వీట్ చేశారు. గతంలో అపహరణకు గురైన ఫాదర్ అలెక్స్ ప్రేమ్ కుమార్ ను, జుడియత్ డిసౌజాను ఆఫ్గనిస్తాన్ నుంచి విడిపించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కేరళకు చెందిన ఫాదర్ థామస్ ను గత మార్చిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.