దాడికి దిగితే యుద్ధమే
కైరో: అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక దాడికి దిగితే యుద్ధం తప్పదని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మంగళవారం హెచ్చరించారు. దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఫ్రెంచి పత్రిక ‘లె ఫిరాగో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసద్ ఈ మేరకు స్పష్టంచేశారు. సిరియా పౌరులపై అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందనే ఆరోపణలతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు సిరియాపై సైనిక దాడి జరపడంపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో అసద్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు సిరియాపై దాడికి అమెరికన్ కాంగ్రెస్ మద్దతు కోరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ మెక్‌కెయిన్, లిండ్సే గ్రాహంలు మద్దతుపలికారు.
అదేవిధంగా అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మంగళవారం‘స్పారో’ క్షిపణి పరీక్ష నిర్వహించడమూ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచింది. ఇదిలాఉండగా, ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా సిరియాపై సైనికదాడిలో తాము పాల్గొనబోమని జర్మనీ స్పష్టం చేసింది. కాగా.. సిరియాపై సైనిక దాడి జరిపే అంశంలో భారత్ మద్దతు ఉందని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సంక్షోభం పరిష్కారానికి సైనిక చర్యకు దిగరాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.