తాజ్మహల్లో పడిపోయిన షాండ్లియర్
అందాల కట్టడం తాజ్మహల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి షాండ్లియర్ ఒకటి పడిపోయింది. దాని బరువు దాదాపు 60 కిలోలు. ఈ ఘటనపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. 6 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పున్న ఈ షాండ్లియర్ను 1905లో లార్డ్ కర్జన్ బహూకరించారు. దాన్ని తాజ్మహల్ రాయల్ గేట్ వద్ద అమర్చారు.
అది ఇప్పుడు పడిపోవడంపై ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు భువన్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్నారు. షాండ్లియర్ ఎందుకు పడిపోయిందన్న విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, అది బాగా పాతది అయిపోవడం వల్లే పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. అయితే, అది పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని టూరిస్టు గైడ్ వేద్ గౌతమ్ చెప్పారు.