
గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
చెన్నై: తమిళ రాజకీయం గవర్నర్ వద్దకు చేరింది. అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ గురువారం సాయంత్రం వేర్వేరుగా ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు. రాష్ట్ర ప్రథమ పౌరుడికి తమ మొర వినిపించారు. తనతో శశికళ బలవంతంగా రాజీనామా చేయించారని, సీఎం పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని గవర్నర్ తో పన్నీర్ సెల్వం చెప్పారు.
తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్ కు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని 'చిన్నమ్మ' కోరారు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పన్నీర్ సెల్వంకు అవకాశం ఇస్తారా, శశికళను ఆహ్వానిస్తారా అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ రెండూ కాదని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.