రాజీవ్ హంతకులను వదలొద్దు: మన్మోహన్ సింగ్
రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వాళ్లను విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, ఒకవేళ తమిళనాడు సర్కారు అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నా అది న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు.
ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా కూడా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతకగా ఉండకూడదని ప్రధాని ఓ ప్రకటనలో అన్నారు. రాజీవ్ హంతకులకు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చిన నేపథ్యంలో మొత్తం ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడులోని జయ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఆయనీ విధంగా తెలిపారు. అంతకుముందే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ రివ్యూ పిటిషన్ కూడా దాఖలుచేసింది. దేశ మాజీ ప్రధానమంత్రితో పాటు పలువురు నిర్దోషులను కూడా చంపిన హంతకులను విడిచిపెట్టడం అన్నిరకాల న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రధాని స్పష్టం చేశారు. అందువల్ల తమిళనాడు సర్కారు వాళ్లను విడిచిపెట్టకూడదని తెలిపారు.