టాటా మోటార్స్ లాభం 23% డిప్
టాటా మోటార్స్ లాభం 23% డిప్
Published Thu, Aug 8 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు టాటా మోటార్స్ రూ.1,726 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంలో అంటే ఏప్రిల్-జూన్’12 కాలానికి ఆర్జించిన రూ.2,245 కోట్లతో పోలిస్తే ఇది 23% క్షీణత. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్ మెరుగైన పనితీరును ప్రదర్శించినప్పటికీ వరుసగా మూడో క్వార్టర్‌లోనూ లాభాలు తగ్గడం గమనార్హం. ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అమ్మకాలు మాత్రం రూ. 43,171 కోట్ల నుంచి రూ. 46,751 కోట్లకు పెరిగాయి. ఇవి 8% అధికం. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 3% క్షీణించి రూ. 279 వద్ద ముగిసింది. కాగా, జేఎల్‌ఆర్ లాభం దాదాపు 29% ఎగసి 30.4 కోట్ల పౌండ్లను తాకగా, ఆదాయం 13% ఎగసి 412 కోట్ల పౌండ్లకు చేరింది. ఆర్థిక మందగమనంతో దేశీయ అమ్మకాలు క్షీణించడం, పోటీ కారణంగా వాహనాల ధరలు తగ్గించడం వంటి అంశాలు లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని కంపెనీ సీఎఫ్‌వో సి.రామకృష్ణన్ చెప్పారు.
19% తగ్గిన దేశీయ అమ్మకాలు
స్టాండెలోన్ ప్రాతిపదికన దేశీయ కార్ల అమ్మకాలు 19% క్షీణించి 1,54,352 యూనిట్లకుపరిమితమయ్యాయి. అంతక్రితం 1,90,483 వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే స్టాండెలోన్ లాభం మాత్రం 242% ఎగసి రూ. 703 కోట్లయ్యింది. గతంలో ఇది రూ. 205 కోట్లు మాత్రమే. ఇందుకు అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్ నుంచి లభించిన రూ. 1,537 కోట్ల డివిడెండ్లు దోహదపడ్డాయి.
Advertisement
Advertisement