ఏటా రెండు కొత్త వాహనాలు
గ్రేటర్ నోయిడా: ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు టాటామోటార్స్ కసరత్తు ప్రారంభిచింది. ఇకపై ఏడాదికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో కోల్పోయిన వాటా సాధించడం లక్ష్యమని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ చెప్పారు. కొత్త మోడళ్లను అందించలేకపోవడం వల్లే అమ్మకాల్లో వెనకబడ్డామని ఆయన అంగీకరించారు. అందుకే ఏడాదికి రెండు మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు.
అందులో భాగంగానే కొత్త హ్యాచ్‌బాక్ బోల్ట్‌ను, కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌ను ఇటీవలనే ఆవిష్కరించామని చెప్పారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవలే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ నెక్సన్‌ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే మరికొన్ని కొత్త మోడళ్లను కస్టమర్లకు అందిస్తామని తెలిపారు.