
నంద్యాలలో బాలకృష్ణ ప్రచారం.. అపశ్రుతి
‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో..’ అంటూ బాలకృష్ణ నంద్యాలలో ప్రచారాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది.
నంద్యాల: ‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో, ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి..’ అంటూ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నుంచి నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కానీ రోడ్డు షో మొదలైన కొద్ది సేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది. బాలయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్.. ఒక బాలుడిని ఢీ కొట్టింది. గాయపడ్డ ఆ బాలుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.
ఇక ప్రచారంలో.. తెలుగువారైన పీవీ నర్సింహారావు నాడు నంద్యాల నుంచి పోటీచేస్తే ఆయన గెలుపు కోసం భూమా కుటుంబం సహకరించిందని, సినిమా షూటింగ్స్ కోసం ఎప్పుడొచ్చినా.. భూమా కుటుంబం ఇల్లు ఇచ్చేవారని, వాళ్ల కూతురు అఖిలప్రియ పర్యాటక మంత్రి కావడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా ‘ఒక్క మగాడు’ సినిమాలో కులాలపై రాసిన డైలాగును బాలయ్య చెప్పగా.. అభిమానులు ఈలలువేసి గోల చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, కాపులు, బలిజలకు టీడీపీ ప్రభుత్వం ఏమేమి చేస్తున్నదో వివరించే ప్రయత్నం చేశారు బాలయ్య.