
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/నెల్లూరు(బారకాసు)/ సాక్షి, అమరావతి: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు ఆయన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పకపోతే, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.