
బ్రిజేశ్ తీర్పుపై సుప్రీంకెళ్తాం: చంద్రబాబు
* రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పార్లమెంట్‌లో పోరాటం
* తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
* జలాల కోసం అన్ని పార్టీలూ ఐక్యంగా పోరాడాలి
* ఈ మెయిల్ విభజనను అడ్డుకుంటాం
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డు ఏకపక్షంగా ఉన్నందున దీనిపై వారం రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళతామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అవార్డు గెజిట్ నోటిఫికేషన్ కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని చెప్పారు. అవార్డు నోటిఫై అయితే 2050 వరకు కృష్ణాడెల్టా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఆ తరువాత కూడా ఈ అవార్డు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని కృష్ణానది ఇసుక తిన్నెల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేవరకు పార్లమెంటులో తమ ఎంపీలు పోరాటం కొనసాగిస్తారని చెప్పారు. కృష్ణానది మిగులు జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినందున దీనిపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. ఈ విషయంపై ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. ఆంధ్రాలో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన సోనియా, ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌లు ఇప్పుడు అన్యాయం జరుగుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. వాళ్ల రాష్ట్రంలో గెలవలేని వాళ్లు మన రాష్ట్రాన్ని విభజించేందుకు ముందుకు వస్తే అంగీకరించేది లేదని, ఈ-మెయిల్ విభజనలను అడ్డుకుంటామని చెప్పారు.
ప్రసంగంలో తడబాట్లు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అఫిడవిట్ రాష్ట్రానికి మరణశాసనంగా మారిందంటూ పదేపదే చెప్పిన చంద్రబాబు తన ప్రసంగంలో పదేపదే తడబడ్డారు. జ్యోతిబసు తనను రెండుసారు ్లముఖ్యమంత్రిగా ఉండమని కోరినా తాను తిరస్కరించానని చెప్పారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని సరిచేసుకుంటూ తనను ప్రధానిమంత్రిగా ఉండాలని కోరారని తెలిపారు. అబ్దుల్ కలాం, కె.ఆర్.నారాయణన్‌లను ప్రధానిగా చేసిన ఘనత (వీరు రాష్ట్రపతులుగా చేశారు) తనదేనని చెప్పారు. తరువాత ఈ తడబాటును సరిదిద్దుకోకుండానే ఉపన్యాసం కొనసాగించడంతో అక్కడున్నవారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేసే సమయంలో మూడొంతుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గురివిందగింజ తరహాలో తమ సభలోని లోపాలను చూసుకోకుండా పులిచింతల ప్రాజెక్టువద్ద జరిగిన విజయమ్మ సభ గురించి చర్చించడంపై పార్టీ కార్యకర్తలు చిరాకు పడ్డారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సీ ఎన్.రాజకుమారి, మాజీమంత్రులు కోడెల శివప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు, కరణం బలరాం, మాజీ చీఫ్‌విప్ కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్యేలు దేవినినే ఉమ, జయమంగళ వెంకటరమణ, ధూళిపాళ నరేంద్ర, పార్టీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ జూరాల ధర్నా రద్దు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద తలపెట్టిన ధర్నాను రద్దు చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బదులు రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తేవటాన్ని నిరసిస్తూ గురువారం బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జూరాల వద్ద చేపట్టిన ధర్నాను రద్దు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.