టీడీపీ ఆందోళనలకు నేతల వ్యతిరేకత | TDP the concern leaders opposition | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆందోళనలకు నేతల వ్యతిరేకత

Published Wed, Sep 2 2015 2:42 AM | Last Updated on Sat, Aug 11 2018 4:50 PM

TDP the concern leaders opposition

- జిల్లాల్లో సమావేశాలకు చుక్కెదురు
- 3వ తేదీన ధర్నాల నిర్వహణా ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్:
టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేయాలని భావిస్తున్న తెలంగాణ టీడీపీకి సొంత పార్టీ నుంచే మద్దతు కరువవుతోంది. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ ముఖ్యనేతలు మాత్రమే ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ర్టవ్యాప్తంగా కార్యరూపంలో ఆందోళనలు చేపట్టింది చాలా తక్కువ. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్ సమస్యపై వరంగల్‌లో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరోజు దీక్ష చేపట్టారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. వీటికి అంతగా స్పందన కన్పించలేదు. ప్రాజెక్టులపై పర్యటనలు చేసినా, ముగ్గురు నలుగురు నాయకులకే అది పరిమితమైంది.

ఒకరకంగా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసింది శూన్యం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ముఖ్య నాయకులు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులోభాగంగానే ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని టీటీడీపీ నిర్ణయించింది. పార్టీ మహిళా అనుబంధ సంఘం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ఈనెల 3న  రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, వీటిని విజయవంతం చేసేందుకు ఆయా జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశాలకు స్పందన కరువైంది.

మరోవైపు ఆయా జిల్లాల్లో స్థానిక నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ సమావేశాలపై ప్రభావం చూపిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్య నాయకులు, అనుంబంధ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశాలే అంతంత మాత్రంగా జరగడంతో పెద్దఎత్తున నిర్వహించాలని భావిస్తున్న ధర్నాల పరిస్థితి ఏమిటన్న సంశయం కొందరు నేతల్లో వ్యక్తం అవుతోంది. అత్యధిక జిల్లాల్లో ఈ సమావేశాలు నామమాత్రంగా జరిగాయని సమాచారం.
 
మీటింగ్‌కు ఎమ్మెల్యేల డుమ్మా !

చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా గురువారం తలపెట్టిన ధర్నా గురించి చర్చించేందుకు హైదరాబాద్ కమిటీ జరిపిన సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు గైర్హాజరైనట్లు తెలిసింది. నగర కమిటీ అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ ను మార్చాలని హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమణలకూ ఈ విషయాన్ని తేల్చిచెప్పారని సమాచారం. దీంతో కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వీరంతా డుమ్మా కొట్టారు. ఆయనను మార్చేదాకా ఏ కార్యక్రమంలో పాల్గొనబోమని నాయకత్వానికి తేల్చి చెప్పారు. కీలకంగా భావిస్తున్న గ్రేటర్‌లో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా ఎలా ధర్నా నిర్వహించాలో, ఎలా విజయవంతం చేయాలో అర్థంకాక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement