ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో మాల్ ప్రాక్టీసు కేసుల్లో ఎక్కువగా దొరికేస్తున్నది విద్యార్థులు కాదు.. టీచర్లేనట. ఇప్పటివరకు 111 మంది సెంటర్ సూపరింటెండెంట్లు, 178 మంది ఇన్విజిలేటర్ల మీద చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అదే విద్యార్థుల మీద మాత్రం కేవలం 70 ఎఫ్ఐఆర్‌లే నమోదయ్యాయి. 54 చోట్ల పరీక్ష కేంద్రాలను రద్దు చేయగా, 57 కేంద్రాలను డీబార్ చేశారు. మొత్తం 327 కేంద్రాల సూపరింటెండెంట్లను మార్చామని, మాస్ కాపీయింగ్ చేయించినందుకు నాలుగు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశామని యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్ డైరెక్టర్ ఏఎన్ వర్మ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి దినేష్ శర్మ సూచనల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల ఆన్సర్ కాపీలను స్క్రీనింగ్ కోసం పంపుతున్నారు. పరీక్షలలో అక్రమాల గురించి తెలియజేసేందుకు వీలుగా ఒక టోల్‌ఫ్రీ నెంబరు 18001806760 ను కేటాయించారు.
టీచర్లు చీటింగ్ చేశారిలా..
కొంతమంది టీచర్లు విద్యార్థులకు చిట్టీలు ఇస్తుండగా, మరికొందరు దగ్గరుండి మరీ వారికి ఆన్సర్లు డిక్టేట్ చేస్తూ దొరికేశారు. ఇంకొంతమంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను ఏకంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు పంపేసి, అక్కడ వేరేవాళ్లతో జవాబులు రాయించారు. తర్వాత మళ్లీ వాటిని హాల్లోకి తెప్పించారు. విద్యార్థులు ఎంచక్కా కాపీలు రాసుకుంటున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నారు. ఏకంగా విద్యార్థులు ఒకరికొకరు ఆన్సర్ షీట్లు మార్చుకుంటున్నా కూడా ఏమీ అనలేదు. పరీక్ష హాల్లోకి పుస్తకాలు, గైడ్లు తీసుకొచ్చి రాస్తున్నా మాట్లాడలేదు.
ఎక్కువగా ప్రైవేటు, సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలలోనే ఈ కాపీల వ్యవహారం ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. మాధ్యమిక విద్యాశాఖకు చెందిన కొంతమంది అధికారులు కూడా లంచాలు తీసుకుని కాపీ మాఫియాతో చేతులు కలిపారని యూపీ మాధ్యమిక శిక్షక్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌పీ మిశ్రా ఆరోపించారు. మాస్ కాపీయింగ్ రాకెట్‌లో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు చెప్పారు.
టీచర్లు కాదు చీటర్లు.. అడ్డంగా దొరికేశారు!
Published Thu, Mar 30 2017 11:42 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
Advertisement
Advertisement