
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకూ బదిలీలు జరగనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకూ బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు బదిలీల విధి విధానాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. టెక్నాలజీ వినియోగంతో అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనితీరు ప్రామాణికంగా తీసుకుని 25 శాతం వెయిటేజీతో బదిలీలు చేపడుతున్నామని, వచ్చే ఏడాది 50 శాతం వెయిటేజీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇందుకోసం పాయింట్లను నిర్ణయించామన్నారు. హేతుబద్దీకరణతో 2,998 పాఠశాలలను విలీనం చేసినట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం విశాఖలో, సెప్టెంబర్ 8న ప్రపంచ అక్ష్యరాస్యత దినోత్సవం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును శనివారం మంత్రిమండలి సమావేశంలో పెడతామన్నారు.
నారాయణ కళాశాలల్లో జరిగిన ఆత్మహత్యలపై ఏర్పాటైన కమిటీ తనకు తిరుపతిలో నివేదిక అందించిందని, అయితే ప్రభుత్వ కార్యదర్శికి నివేదిక ఇవ్వమని తాను సూచించానన్నారు. రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు పెట్టాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పలేదని, ర్యాగింగ్ చేస్తే కఠినమైన కేసులు పెడతామని తాను చెప్పానని అంటూ మంత్రి పొంతన లేని సమాధానాలిచ్చారు. బదిలీల కౌన్సెలింగ్ పూర్తయ్యే లోగా డీఎస్సీ ఖరారు చేస్తామని, డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ ఇస్తామన్నారు.
మార్గదర్శకాలివే..
⇒ ఆగస్టు 1వ తేదీకి ఒకే ప్రాంతంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు, ఐదేళ్లు పూర్తి చేసిన గ్రేడ్-2 టీచర్లకు బదిలీ తప్పనిసరి.
⇒ ఆగస్టు1, 2015 నాటికి రెండేళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నవారి వ్యక్తిగత వినతులను పరిశీలిస్తారు. వయసు 50 లోపు ఉన్న గ్రేడ్-2 హెచ్‌ఎం లు బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉంటే బదిలీ తప్పనిసరి.
⇒ రేషనలైజేషన్‌లో బదిలీ అయిన టీచర్లు ట్రాన్స్‌ఫర్ కౌన్సెలింగ్ కనీస గడువు రెండేళ్లు లేకపోయినా బదిలీల్లో పాల్గొనవచ్చు.
⇒ ఉర్దూ మీడియం స్కూల్స్‌లో మొదటి లాంగ్వేజ్ ఉర్దూ చదివిన గ్రేడ్-2 హెచ్‌ఎం లకు ప్రాధాన్యత ఇస్తారు.
⇒ బదిలీలను అప్రూవ్ చేసేందుకు కమిటీలు ఏర్పాటు.
షెడ్యూల్ ఇలా..
⇒ సెప్టెంబర్ 6న ఖాళీల ప్రకటన. 7 నుంచి 10వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ. హా 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన.
⇒ 15, 16వ తేదీల్లో అభ్యంతరాల నమోదు.
⇒ 19న తుది సీనియారిటీ జాబితా (పాయింట్లతో కలిపి) ఖరారు.
⇒ 21 నుంచి 24 వరకూ వెబ్ ఆప్షన్లు
⇒ బదిలీ ఉత్తర్వులు, చేరేందుకు గడువు సెప్టెంబర్ 30.