పాపం.. తండ్రి కూతుర్ని చంపేలా చేశారు
ముంబై: పక్కింటి వాళ్లతో జరిగిన ఘర్షణ కన్నకూతురి ప్రాణాలు తీసింది. తోపులాటలో తండ్రి మీదపడటం వల్ల అతని చేతిలో ఉన్న కత్తి ఛాతీలోకి దిగడంతో కళ్లెదుటే కూతురు మరణించింది. ముంబైలోని మోతీలాల్ నగర్ స్లమ్ ఏరియాలో ఈ విషాదకర సంఘటన జరిగింది.
రాజేష్ (41) అనే వ్యక్తి డ్రైవర్. అతని కూతురు మేఘన అఘవానె (17) కాలేజీలో చదువుకుంటోంది. సోమవారం రాత్రి రాజేష్, పక్కింటివాళ్లు చిన్న విషయానికి గొడవ పడ్డారు. ఆ సమయంలో రాజేష్ చేతిలో కూరగాయలు కోసే కత్తి ఉంది. ఘర్షణ సందర్భంగా పక్కింటివాళ్లు తోయడంతో రాజేష్ అదుపు తప్పి కూతురుపై పడ్డాడు. ఆయన చేతిలో ఉన్న కత్తి మేఘన ఛాతీలోకి దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ పక్కింటివారిని ఆరుగురిని అరెస్ట్ చేశారు.