టీ బిల్లు పాసవడం అసాధ్యమే | Telangana Bill will pass impossible due to full of errors: L.K Advani | Sakshi
Sakshi News home page

టీ బిల్లు పాసవడం అసాధ్యమే

Published Wed, Feb 12 2014 3:23 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

టీ బిల్లు పాసవడం అసాధ్యమే - Sakshi

టీ బిల్లు పాసవడం అసాధ్యమే

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు సరైన తీరులో లేదని, పార్లమెంటులో అది పాసవడం అసాధ్యమేనన్నారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఆ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల బృందం మంగళవారం పార్లమెంటులో అద్వానీ, రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీలను వేర్వేరుగా కలసి, బిల్లు ఆమోదానికి సహకరించాలని వినతిపత్రాలు అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మంచి ఫలితాలు వస్తాయని నేతలు వివరించారు. దీనికి అద్వానీ స్పందిస్తూ.. తాము తెంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నప్పటికీ, యూపీఏ రూపొందించిన తెలంగాణ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ సభ్యులే సభలను అడ్డుకుంటున్నారని, ఇక బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు. విభజన నిర్ణయానికి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై కాంగ్రెస్‌కు చెందిన ఆ ప్రాంత సభ్యులు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో అదే పార్టీకి చెందిన సీమాంధ్ర సభ్యులు పార్లమెంటును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
 తన రాజకీయ జీవితంలో ఇలాంటి పార్లమెంటును ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాంగ్రెస్ వారు తప్పులు చేస్తూ బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభలు సక్రమంగా సాగడంలేదని, సమయం కూడా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు పెట్టడం, ఆమోదం పొందడం అసాధ్యమేనని అద్వానీ మాటల్లో స్పష్టమైనట్టు తెలంగాణ టీడీపీ నేతలు తెలిపారు. బిల్లుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని అరుణ్ జైట్లీ వారికి చెప్పారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని ప్రస్తావన లేదని, ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వాలని అద్వానీ, జైట్లీని కోరినట్లు నామా నాగేశ్వరావు చెప్పారు. అద్వానీ, జైట్లీలతో భేటీ అనంతరం నామా, ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. బీఏసీ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మాటలను చూస్తే తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదని తెలుస్తోందని, న్యాయపరమైన అంశాలను అడ్డంపెట్టుకుని తప్పించుకునేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
 ‘కాంగ్రెస్‌కు రెండు ప్రాంతాల్లో నష్టం’
 ఇన్ని రోజులు తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వార్తలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇతర కారణాలు చూపుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీ  విజయ్‌చౌక్ వద్ద  విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు తేవడం లేదనే సంగతి  మంగళవారం బీఏసీ సమావేశంలో తేటతెల్లం అయిందన్నారు. చివరి నిమిషంలో ఇలా చేయడంతో సీమాంధ్రలో, తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్‌నాయకులు భావిస్తున్నారన్నారు. కానీ రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు.
 
 బాబుకు ఢిల్లీలో ఏం పని?: నాగం
 చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ చేరింది, తెలంగాణను అడ్డుకునేందుకేనని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే తాము ఢిల్లీనుంచి తిరిగి వెళ్తామన్నారు. తెలంగాణపై బీజేపీ నిర్ణయంలో మార్పు లేదని, ఢిల్లీలో మంగళవారం తెలంగాణ టీడీపీ నాయకులకు సైతం అద్వానీ ఇదే స్పష్టత ఇచ్చారని నాగం అన్నారు. అయినా, తెలంగాణ ఏర్పాటుపై తప్పుదోవపట్టించే ప్రకటనలు చేస్తూ, తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.బాబుకి కోల్‌కతా నుంచి నేరుగా ఢిల్లీ రావాల్సిన అవసరమేమిటని నాగం ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement