స్తంభించిన సీమాంధ్ర | Telangana fallout: Normal life hit in Seemandhra amid bandh | Sakshi
Sakshi News home page

స్తంభించిన సీమాంధ్ర

Published Sat, Oct 5 2013 3:36 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

స్తంభించిన సీమాంధ్ర - Sakshi

స్తంభించిన సీమాంధ్ర

సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రమంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72గంటల బంద్ పిలుపు మేరకు శుక్రవారం సీమాంధ్ర స్తంభించింది. అన్ని జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా సాగింది. ఏపీఎన్‌జీవోల సంఘం కూడా 48గంటల బంద్‌కు పిలుపిచ్చిన నేపథ్యంలో సామాన్య జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగింది. అత్యవసర సర్వీసులు మినహా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు మూతపడ్డాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టడంతో హైవేలపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
 విశాఖ పోర్టుకూ బంద్ సెగ :  విశాఖలో పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు బైఠాయించారు. ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ బంద్ చేపట్టడంతో సుమారు 1100 ఆయిల్‌లారీలు నిలిచిపోయాయి. దీంతో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీ ప్లాంట్లలో ఉత్పత్తులు స్తంభించాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.
 
 ప్రభుత్వ వాహనానికి నిప్పు : కర్నూలు జిల్లా ఆలూరులో ప్రభుత్వ వాహనాన్ని సమైక్యవాదులు తగులబెట్టారు. మద్దికెరలో ఓ షాపు తెరిచి ఉండటంతో అందులో ఆరు టీవీలను పగులగొట్టారు. కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల పరిధిలోని  రహదారులను వైఎస్సార్ సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వెల్దుర్తిలో జాతీయ రహదారిని, మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటకకు వెళ్లే రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్ జిల్లా కడపలో విద్యార్థుల అరెస్టులకు నిరసనగా ఆకాశవాణి కేంద్రాన్ని ముట్టడించారు. పులివెందులలో జేఎన్‌టీయూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు  జిల్లావ్యాప్తంగా హైవేలపై రాస్తారోకోలు నిర్వహించారు.
 
 ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఐకేపీ కార్యాలయంలో కంపూటర్లు ధ్వంసం చేశారు. పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ నేత హరికృష్ణ ఆధ్వర్యంలో మన్మోహన్, సోనియా, బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. గుంటూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రోడ్లమీదకు చేరి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు జాతీయ రహదారులను పార్టీ కార్యకర్తలు దిగ్బంధించారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆందోళకారులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఉద్యోగ జేఏసీ నేతలు శ్రీవారిమెట్టు మార్గంలో రోడ్డుపై బండ్లు అడ్డంగా పెట్టి భక్తులను అడ్డుకున్నారు. విభజన వార్తలను చూడలేమంటూ గోకుల్ సర్కిల్‌లో టీవీలను పగులగొట్టి నిరసన తెలియజేశారు.
 
 బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుపై దాడి : తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జేఏసీ నేతలు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు జాతీయ రహదారి-16ని దిగ్బంధించి రాకపోకలను స్తంభింపచేశారు. రాజానగరంలో పాత జాతీయ రహదారిపై సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.  ముమ్మిడివరం, పిఠాపురంలలో 216 నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏటీఎంలు సైతం మూతపడ్డారుు. 214 జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఉభయ గోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిని ఎన్జీవోలు దిగ్బంధించారు.
 
 ఇచ్ఛాపురం చెక్‌పోస్టు మూసివేత : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో వాహన తనిఖీలు, కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.  టెక్కలి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జగతిమెట్ట వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎచ్చెర్లలో అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
 
 వైద్యసేవలకూ ఆటంకం : ప్రభుత్వ నర్సులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అత్యవసర విధులు మినహా మిగిలిన అన్ని సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి విశాఖలో  తెలిపారు. దీంతో రోగుల సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది.
 
 ఎక్కడికక్కడ రైల్‌రోకోలు
 కడపలో రిజర్వేషన్ కౌంటర్ ధ్వంసం
 సాక్షి నెట్‌వర్క్: శుక్రవారం వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదులు పలుచోట్ల రైల్‌రోకోలు చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు దాదాపు మూడు గంటలకుపైగా రైలురోకో నిర్వహించారు. అరకోణం ప్యాసింజర్ రైలును 50 నిమిషాలు, మరో గూడ్స్ రైలును 1.15 గంటలు, ముంబై నుంచి చెన్నైకు వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌ను అరగంటకుపైగా నిలిపేశారు. ఆ తర్వాత ముంబై నుంచి కన్యాకుమారికి వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్‌ను మరో అరగంటపాటు ఆపారు. మధ్యాహ్నం రైలుపట్టాలపైనే భోజనం చేశారు. కడపలో సమైక్యవాదులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్, కంప్యూటర్, ఫర్నిచర్‌లను ధ్వంసంచేశారు. దీంతో రిజర్వేషన్ సేవలు నిలిచిపోయాయి.
 
  పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ఏలూరులో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే జన్మభూమి, విశాఖవైపు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్దిసేపు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో అనంతపురం, ధర్మవరం, కదిరి, తాడిపత్రిల్లో ఆందోళనకారులు రైల్‌రోకో నిర్వహించారు. గుంటూరు-యశ్వంత్‌పూర్, హిందూపురం-గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. రామచంద్రనగర్ రైల్వేగేటు వద్ద, అనంతపురంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైల్వే లైన్‌పై టైర్లు అడ్డంగా వేసి నిప్పుపెట్టారు. గుంతకల్లులో ఆందోళనకారులు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా  కడియం రైల్వే స్టేషన్‌ను   ముట్టడించారు. సిగ్నల్ రూమ్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బందితో సమైక్యాంధ్ర నినాదాలు చేయించారు. శ్రీకాకుళం జిల్లా  పలాస రైల్వేస్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, సమైక్యవాదులు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement