అసెంబ్లీలో ఎవరేం మాట్లాడారంటే..
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం
సీఎం నియోజకవర్గంలోనే ఎక్కువ ఆత్మహత్యలు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ పదహారు నెలల్లోనే వ్యవసాయంలో తీవ్ర సంక్షోభం నెలకొందని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘తెలంగాణవ్యాప్తంగా 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఎక్కువమంది చనిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తగ్గిస్తోంది’’ అని ఆరోపించారు. రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆత్మహత్యల సంఖ్య తేల్చిందని, వారందరికీ పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సభలో రైతు ఆత్మహత్యలపై చర్చలో భాగంగా ప్రసంగించారు. పంటల బీమా పథకం ప్రీమియానికి సంబంధించి చెక్కులు వసూలు చేసి, కొన్ని నెలల తర్వాత వాటిని వెనక్కి పంపుతున్నారన్నారు.
‘‘పగటి వేళ కేవలం మూడు గంటలు అంతరాయాలతో క రెంటు వస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కుంటుపడ్డాయి. తెలంగాణను విత్తన భాండాగారం చేస్తామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రుణమాఫీ అమలు తీవ్ర గందరగోళంగా ఉంది. మిగతా 50 శాతం మొత్తాన్ని నెల రోజుల్లో అందిస్తామని సభలో ప్రభుత్వం ప్రకటన చేయాలి’’ అని డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న, చెరుకులకు బోనసివ్వాలని, మద్దతు ధర పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. రైతు సమస్యకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించటం అర్థరహితమన్నారు. పంట రుణాలు పెంచటంతోపాటు వడ్డీ లేని రుణాలందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
పత్తికి మద్దతు ధర ఇప్పించండి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ వన్ టైం సెటిల్‌మెంట్ చేస్తే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయే అవకాశముందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయని ధ్వజమెత్తారు. మార్కెట్లలో రూ.1,200కు క్వింటాలు కొనుగోలు చేస్తే దిక్కుతోచక పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకోరా? అని ప్రశ్నించారు. పత్తికి మద్దతు ధర లభ్యమయ్యేలా ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టాలని, క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం రైతుల ఆత్మహత్యలు, వర్షాభావ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రసంగించిన అనంతరం ఎర్రబెల్లి మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తే, ఈ ప్రభుత్వం సబ్సిడీని 33 శాతానికి తగ్గించటం అన్యాయమన్నారు. మార్కెట్లో మంచి పల్లీ రూ. 5,200కు క్వింటాలు దొరుకుతుంటే.. ప్రభుత్వం రూ.9,000 చొప్పున కొని రూ.6,300కు రైతులకు అమ్ముతోందని ఎద్దేవా చేశారు. నష్టాల్లో ఉన్న రైతులకు ఒక్కో ఎకరానికి ఒక డీఏపీ, యూరియా బస్తాను సబ్సిడీపై అందించాలన్నారు. గతంలో రెండు నెలల్లోనే ఛత్తీస్‌గఢ్ కరెంటు ఇస్తామని, మోకాలడ్డు పెట్టి గోదావరి నీటిని తెలంగాణకు మళ్లిస్తాం అని సీఎం చేసిన ప్రకటనల క్లిప్పింగ్‌లను చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు 1,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ, వారి వివరాలతో జాబితాను స్పీకర్‌కు అందించారు. వీరందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలపై సీఎంకు అవగాహన ఉంది
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎంకు రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, అందుకే ఎప్పుడూ లేనంతగా వ్యవసాయంపై శాసనసభ అద్భుతంగా చర్చిస్తోందని అధికారపక్ష సభ్యుడు రామలింగారెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎంతో చలించిపోయే సీఎం కేసీఆర్ కంటతడి పెడతారని, కేసీఆర్‌కు- రైతుకు... చేపకు-నీళ్లకు ఉండే సంబంధ ఉందని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ బుధవారం ఉదయం ఆయన ప్రసంగించారు. కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసి రైతులకు మేలు చేయాలని కేసీఆర్ తపిస్తున్నారన్నారు. కలెక్టరేట్లలో రైతుల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, సమస్యలు ఉన్నవారు వాటిని చెప్పుకొంటే ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. గ్రామస్థాయిలో ఉండే సంఘాలు, సంస్థలు కూడా రైతులను చైతన్యపరచి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి విరమించుకునేలా చేయాలని సూచించారు. అప్పులు ఇచ్చి వేధించేవారిని నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరమన్నారు.
హరీశ్ నన్ను బెదిరించారు!: సంపత్
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు వెలిబుచ్చిన సందేహాలకు బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తున్న సందర్భంగా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లేచి ‘మంత్రి హరీశ్‌రావు నన్ను బెదిరించారు. నేను చాలా నష్టపోతానని సభలో అన్నారు. నా ప్రాణాలకు ముప్పు ఉందేమోనని భయమేస్తోంది. టీవీల్లో స్క్రోలింగ్‌లు వస్తున్నాయి. ఎస్‌ఎమ్మెస్‌లు వస్తున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. తనకు మైకు ఇవ్వాలంటూ పోచారం మాటలకు అడ్డుపడ్డారు. దాంతో ప్రతిపక్షనేత జానారెడ్డి కలగజేసుకుని, సభ్యుడి ఆందోళనను పరిగణలోకి తీసుకొని మంత్రి హరీశ్‌రావు మాటల్లో బెదిరింపు వ్యాఖ్యలు ఉంటే ఉపసంహరించాలని సూచించారు.
అందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఒప్పుకున్నప్పటికీ, సంపత్ మరో సభ్యుడు రామ్మోహన్‌రెడ్డితో కలసి పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. దీనిపై హరీశ్‌రావు వివరణ ఇస్తూ, మంత్రి పోచారం మాట్లాడుతున్నప్పుడు ఆయన సమాధానం వినాల్సిందిగా సభ్యులను కోరినట్లు చెప్పారు. సంపత్ అడ్డుతగిలితే ‘ప్రజలు గమనిస్తున్నారు తమ్ముడూ!’ అంటూ సంపత్‌కు చెడ్డపేరు రావద్దని, నియోజకవర్గ ప్రజల దృష్టిలో చులకన కావద్దని.. నష్టపోతావు అని అన్నట్లు చెప్పారు. సంపత్ దీనిని తప్పుగా అర్థం చేసుకుంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.
మంత్రులూ! సభకు రండి
చీఫ్ విప్‌తో ఫోన్లు చేయించి పిలిపించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: బుధవారం అసెంబ్లీ వాయిదా పడకముందే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. రైతు ఆత్మహత్యలపై ఆయా పక్షాల విమర్శలకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బదులివ్వాల్సిన సమయంలో సభలో అధికార పక్ష సభ్యుల సంఖ్య చాలా పలుచగా ఉంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ కొద్దిసేపు సభ నుంచి వె ళ్లిపోయారు. వెంటనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటిదారి పట్డారు. మధ్యాహ్నం మూడింటికి సభ తిరిగి సమావేశమైనప్పుడు అధికారపక్షం నుంచి హాజరు సరిగా లేకపోదని, సగానికిపైగా మంత్రులు వె ళ్లిపోయారని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్ చేసి వారిని వెనక్కు పిలిపించారని టీఆర్‌ఎస్ సభ్యుల ద్వారా తెలిసింది. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మినహా మంత్రులంతా సభలో ఉండాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం.
పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రజల పొట్ట నాదే, బట్ట నాదే’ అని అన్నారు. మనిషికి కావాల్సిన ఆహారం, బట్ట (పత్తి) వ్యవసాయం ద్వారానే సమకూరుతాయని చెప్పుకొచ్చారు. వాణిజ్య పన్నుల మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసిస్తే, వ్యవసాయ మంత్రిగా తాను రైతుల కోసం ఖర్చు చేస్తానని, తిరిగి పన్నుల రూపంలో వాణిజ్య శాఖకే జమ చేస్తామని అన్నారు.