ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రా జెక్టుల కోసం చేసిన ఖర్చు, పెరిగిన ఆయకట్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంశాలపై గురువారం ఇక్కడి గాంధీభవన్‌లో కసరత్తు చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీఏసీ చైర్‌పర్సన్ గీతారెడ్డి, మాజీ మంత్రులు జి.చిన్నారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, ఈరవత్రి అనిల్, దాసోజు శ్రవణ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
శ్రవణ్ రూపొందిస్తున్న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కొత్త, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చేసిందేమీ లేదని విమర్శించారు. తమ పార్టీ హయాంలో జలయజ్ఞంలో 90 శాతానికిపైగా పూర్తి చేసిన పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చుచేస్తే 33 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించొచ్చని చెబుతున్నా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పట్టించుకోవడంలేదని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుల గురించి వాస్తవాలు, టీఆర్‌ఎస్ చేస్తున్న ద్రోహం, కేసీఆర్ చెబుతున్న అబద్ధాల వంటివాటితో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ చెప్పారు.