
తెలంగాణ మంత్రుల్లో జోష్
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి రెండునెలలు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని నిన్నటివరకు తీవ్ర ఆందోళనలో ఉన్న మంత్రులు గురువారం కేంద్ర కేబినెట్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర కేబినెట్ మాదిరిగానే అసెంబ్లీ, పార్లమెంటులోనూ విభజన ప్రక్రియ సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. మొత్తంమ్మీద డిసెంబర్ నాటికి తెలంగాణ ప్రక్రియ పూర్తయి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలావుండగా అక్టోబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్ భేటీ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందనే విషయం తెలంగాణ మంత్రులందరికీ ముందే తెలుసునని సమాచారం. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈ విషయాన్ని ఆయా నేతలకు చెప్పారంటున్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేసినా విభజన ప్రక్రియను ఆపకూడదనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందనే విషయాన్ని జైపాల్‌రెడ్డి ద్వారా స్పష్టంగా తెలుసుకున్న మంత్రులు ఇటీవల కొద్దికాలంగా తమ విధి నిర్వహణలో ప్రత్యేక రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యహరిస్తున్నారు. తమ తమ శాఖలకు సంబంధించి నిర్వహిస్తున్న సమీక్షల్లో రాష్ట్ర విభజనను దృష్టిలో ఉంచుకునే వ్యవహరించాలని అధికారులకు మౌఖికంగానే అయినా స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు తెలంగాణను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన విభజన రేఖను గీసినట్లు తెలిసింది.
తెలంగాణలో గోదాముల కొరత ఉందని, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వరి ధాన్యం అధికంగా పండే అవƒ కాశాలున్నందున ఆయా జిల్లాల్లో గోదామ్చులు ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం, జానారెడ్డి సైతం ఏ అంశంపై అధికారులు తనను కలిసేందుకు వచ్చినా తెలంగాణ సమస్యల పరిష్కారానికే తగిన ప్రాధాన్యతనివ్వాలని ఆదేశిస్తున్నారు. కొందరు మాత్రం.. విభజనƒ ను సీఎం గట్టిగా వ్యతిరేకిస్తుండటం, సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తుండటంతో తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగబోదనే అనుమానంతో ఉన్నారు. చివరకు కేబినెట్ ఆమోదం లభించడంతో ఇక ఎవరేం చేసినా విభజన ప్రక్రియ ఆగదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ నోట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు మంత్రులు మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.
నేతలు ఏమన్నారంటే...
తెలంగాణ ప్రజల విజయం: డిప్యూటీ సీఎం
తెలంగాణ నోట్ కేబినెట్ ఆమోదం పొందడం ఈ ప్రాంత ప్రజల విజయం. అసెంబ్లీలోనూ తీర్మానం తేలికగా ఆమోదం పొందుతుంది. ఇకపై ఎవరూ సెటిలర్‌స అనే పదం వాడొద్దు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన హోదాకు తగ్గట్లు వ్యవహరించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపారనే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరవొద్దు.
హైకమాండ్‌కు కృతజ్ఞతలు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయం. ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలకు కృతజ్ఞతలు.
ఉద్యమకారులకు అభినందనలు: సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ నోట్‌ను ఆమోదించిన కేంద్రానికి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్యమకారులకు అభినందనలు.
స్వాగతిస్తున్నాం: డీకే అరుణ
కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు.