
సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ
సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ రాజ్యాంగం ప్రకారం విభజన ప్రక్రియ
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ కార్యాలయంలో జరిగిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు.
నెలరోజులు గడిచినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగలేదన్నారు. విభజన ముసాయిదా బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఆయన సూచించారు. ఈ నెల 23లోగా బిల్లుపై చర్చించి అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంట్‌కు పంపగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీ నిర్ణయం అనుకూలంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ విభజన ప్రక్రియను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. కిరణ్ కాంగ్రెస్ సీఎంగా ఉన్నారని, ఆయన కొత్త పార్టీ ఎందుకు పెడతారని ఆయన ప్రశ్నించారు.
పీవీ గొప్ప మేధావి: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజకీయ మేధావి, సంస్కరణవాది అని గులాంనబీ ఆజాద్ కొనియాడారు. సుస్థిర పాలన, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆయన చలువేనని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. కాగా, ఈ ఏడాదితో భారతదేశం పోలియోరహిత దేశంగా మారుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రచురించిన బాపూజీ డైరీ-2014, ఆచార్య వినోభాబావే టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్, సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.