
భారత్‌కు చేరిన డాక్టర్ రామమూర్తి
లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డ తెలుగు వైద్యుడు డాక్టర్ కోసనం రామమూర్తి శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు.
- 18 నెలల క్రితం లిబియాలో కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు
- భారత్‌లో విస్తరించే ప్రణాళికతో ఐసిస్ ఉంది: రామమూర్తి
న్యూఢిల్లీ: లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డ తెలుగు వైద్యుడు డాక్టర్ కోసనం రామమూర్తి శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రామమూర్తి.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్థిరపడ్డారు. డాక్టర్‌గా పనిచేయడానికి లిబియా వెళ్లిన ఆయనను 18 నెలల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐసిస్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. స్వదేశానికి సురక్షితంగా చేరిన రామమూర్తి ఢిల్లీలో మాట్లాడుతూ... భారత్‌లో విస్తరించాలనే ప్రణాళికతో ఐసిస్ ఉందని చెప్పారు.
ఐసిస్ ఉగ్రవాదులతో సంభాషణల్ని బట్టి భారత విద్యావ్యవస్థ, ఆర్థిక వృద్ధి వారిని ఎంతగానో ఆకట్టుకుందనే విషయం అర్థమైందన్నారు. వారి ప్రణాళికలు ఏమిటో తనకు చెప్పలేదన్నారు. తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, వాళ్ల చేసిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు చూడాలని ఒత్తిడి చేశారని చెప్పారు. ఐసిస్ కోసం పనిచేయమని వారు కోరారని, అయితే తనకు అలాంటి అనుభవంలేదని చెప్పానని వెల్లడించారు. తనను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ భద్రతా సలహాదారుకు రామమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.