యువకుడి ప్రాణం తీసిన రోబో!
గుర్గావ్: ఇటీవల జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ కార్ల కంపెనీలో ఒక మనిషిని రోబో చంపిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన భారత్ లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో ప్రాంతానికి రామ్ జీ లాల్ (24) అనే యువకుడు బుధవారం రోబో చేతిలో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. రామ్ జీ లాల్ యూపీలోని మనేసార్ ఇండిస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్(ఐఎమ్టీ) లో ఉన్న ఎస్కేహెచ్ లోహపు కంపెనీలో వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ కంపెనీలో సంవత్సరన్నర క్రితం రామ్ జీ జాయిన్ అయ్యాడు. అయితే పలు రకాలైన మిషన్లను వెల్డింగ్ ద్వారా అతికించడమే ఆ కంపెనీ ప్రత్యేకత.ముందుగా సిద్ధం చేసిన ఒక ప్రొగ్రామ్ ఆధారంగా ఆ లోహపు షీట్లను రోబోట్లు పైకి ఎత్తి నిర్దేశించిన ప్రాంతంలో పెడతాయి.
దీనిలో భాగంగా నిన్న కొన్నిఅతికించిన లోహపు షీట్లను తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే ఒక షీట్ మాత్రం రోబోట్ లో సరిగా అమరకపోవడంతో దానిని సరి చేసేందుకు రామ్ జీ లాల్ వెళ్లాడు. ఈ క్రమంలో ఆ షీట్ ను సరి చేసేందుకు వెళ్లిన రామ్ జీ రోబోట్ మధ్యన ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆ యువకుడ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. రామ్ జీ పనిచేసే యూనిట్ లో 63 మంది కార్మికులతో పాటు, 39 రోబోట్ లు ఉన్నాయి. ఈ ఘటన తమ కళ్లముందే జరగడం పట్ల తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో రోబోట్ వద్దకు రామ్ జీ వెళ్లకుండా ఉండి ఉంటే ప్రాణాలతో బతికి బయటపడేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.