కాంగ్రెస్ నిర్ణయం మాత్రమే చెప్పింది: చిదంబరం
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం మాత్రమే చెప్పిందని కేంద్ర మంత్రి చిదంబరం ఈరోజు రాజ్యసభలో చెప్పారు. తెలంగాణపై జరిగిన సుదీర్ఘ చర్చకు ఆయన సమాధానం చెప్పారు. మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న తరువాత నిర్మాణాత్మక చర్చకు అవకాశం ఉందన్నారు. ఈ దశలో పూర్తి స్థాయి చర్చ సరికాదన్నారు. ప్రశ్నలు ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీని అడగాలన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ తరపున సమాధానం ఇవ్వడంలేదని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుపై కసరత్తు చేశారా? అని అడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కాంగ్రెస్లో జరిగిన కసరత్తు మరే అంశంపై జరగలేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రజల మధ్యలోనే ఉందని, అది కసరత్తు కాదా?అని అడిగారు. తాను హొం మంత్రిగా ఉన్న సమయంలో రెండు సార్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడినట్లు చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అభిప్రాయాలను మార్చుకున్నాయన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవలసి ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అంతా రాజ్యాంగం ప్రకారం జరుగుతుందని తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం చెప్పిన తరువాతే చివరగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. తెలంగాణపై తాము నిర్ణయం తీసుకుంటే హడావుడి అని అంటున్నారు. టిడిపి నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యం, తాము తీసుకుంటే నిరంకుశమా? అని అడిగారు. అందరితో సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి పార్టీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రతి అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు.
అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదావేశారు.