
19 నెలలకే చదువుతున్నాడు!
న్యూయార్క్: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ఈ బుడతడు విద్వత్ పుణికిపుచ్చుకొని పుట్టినట్టున్నాడు. 19 నెలలకే 300 ఆంగ్ల పదాలను కంఠతా నేర్చేసుకున్నాడు. వాటిని ఇట్టే గుర్తుపట్టి అట్టే చదివేస్తున్నాడు. 50 వరకు అంకెలను తప్పులేకుండా లెక్కపెడుతున్నాడు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో నివసిస్తున్న లటోయ వైట్‌సైడ్ తన కొడుకు కార్టర్ గొప్పతనాన్ని తెలియజెప్పే వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఈ బాల మేధావి గురించి నేడు ప్రపంచానికి తెల్సింది.
తన కొడుకు ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడే అక్షరాలను గుర్తుపట్టడం మొదలు పెట్టాడని, ఎవరూ ఏమీ చెప్పకుండానే 12 నెలలప్పుడు పదాలు పలకడం ప్రారంభించాడని తల్లి చెప్పింది. ఇటీవల తాను ఇంగ్లీషు పదాలున్న ఫ్లాష్ కార్డులను తీసుకొచ్చి ఒక్కసారి మాత్రమే చదివించానని, వాటిని ఇట్టే గుర్తు పెట్టుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే మళ్లీ చదివిస్తూ వీడియో తీశానని తెలిపింది.
వీడియో క్లిప్‌లో బుడతడు కొన్ని పదాలను ఠక్కున చదవగా, కొన్ని కఠిన పదాలను కూడబలుక్కొని చదివాడు. తాను చదివింది కరెక్టేనా అన్నట్టు తల్లివైపు చూడడం, అవునన్నట్టు తల్లి తలూపగానే మరో పదాన్ని తీసుకొని చదవడం కనిపించింది. అన్ని ఫ్లాష్ కార్డులు చదవడం అయిపోయాక వాటిని తల్లికిచ్చేశాడు.
సాధారణంగా చురుకైన పిల్లలు 18 నెలల వయస్సులో దాదాపు ఆరు పదాలు పలుకుతారు. మూడేళ్ల వయస్సులో పదాలు గుర్తుపట్టి చదవడం ప్రారంభిస్తారు. ఐదేళ్ల వయస్సులో సంపూర్ణ వాక్యాలు చదువుతారు.