నవతరం నాయకత్వం | The leadership of the new age | Sakshi
Sakshi News home page

నవతరం నాయకత్వం

Published Sun, Oct 25 2015 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

నవతరం నాయకత్వం

నవతరం నాయకత్వం

కొత్తతరం నేతలకు పట్టం కడుతున్న ప్రపంచ దేశాలు
కెనడా పార్లమెంటు ఎన్నికల్లో జస్టిన్ భారీ విజయం
గ్రీస్‌లో ఏడాది వ్యవధిలో రెండుసార్లు గెలిచిన సిప్రాస్
చెక్ రిపబ్లిక్‌లో సొబొట్కా, బెల్జియంలో మైఖేల్, ఐస్‌ల్యాండ్‌లో సిగ్మండూర్, పోలండ్‌లో డుడా గెలుపు
యువతరం ఆలోచనలను ప్రతిఫలిస్తున్న ఫలితాలు
సమానత్వం - సంక్షేమానికి నేతల నిబద్ధతే కొలబద్ద
 
 ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో కొత్త పవనాలు వీస్తున్నాయి. నవీన ఆలోచనా ధోరణి.. అందరూ సమానమేనన్న సమగ్ర దృ క్పథం.. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత.. అనే విలువలే కొలబద్దగా నవతరం నాయకులకు ప్రపంచ యువతరం పట్టం కడుతోంది. సామాన్యులకు దూరంగా వినువీధుల్లో విహరించే బడా నేతలను గతంలోకి పంపిస్తూ.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారికి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్పందించే వారిని తెరపైకి తెచ్చి పగ్గాలు అప్పగిస్తోంది. మితవాద, అతివాద ధోరణులను పక్కనపెట్టి.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి విలువలకు పెద్ద పీట వేసే లిబరల్, డెమొక్రటిక్, సోషలిస్ట్ పార్టీలకు అధికారం అందిస్తోంది. నవతరం నేతల సారథ్యంలోని ఈ పార్టీలు వినూత్న ఆలోచనా రీతులతో ప్రజల చెంతకు చేరుతూ వారి ఆదరణ పొందుతున్నాయి. నిన్నటి కెనడా ఎన్నికలు కానీ.. మొన్నటి గ్రీస్ ఎన్నికలు కానీ.. అంతకుముందు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఐస్‌ల్యాండ్, అల్బేనియా, చెక్ రిపబ్లిక్, క్రొయేషియా, బల్గేరియా వంటి దేశాల్లో ఈ నూతన రాజకీయ పవనాలు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న యువతరం ఆలోచనకు అద్దంపడుతున్నాయి.   
 - సెంట్రల్ డెస్క్
 
 కెనడాలో జస్టిన్ ట్రుడో గెలుపు
 కెనడాలో గత సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. యువనేత జస్టిన్ ట్రుడో సారథ్యంలోని లిబరల్ పార్టీ మెజారిటీ (హౌస్ ఆఫ్ కామన్స్‌లోని మొత్తం 338 సీట్లలో 184 సీట్లు గెలిచి) సాధించింది. కేవలం 43 సంవత్సరాల వయసున్న జస్టిన్ నవంబర్ 4వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 99 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలోకి మారింది. ఈ ఎన్నికలకు ముందు మూడో స్థానంలో ఉన్న లిబరల్ పార్టీ నాలుగేళ్లలోనే ఇంతటి ఘన విజయం సాధించటానికి కారణం.. నవతరం ఆలోచనలను ప్రతిబింబించే జస్టిన్ నూతన దృక్పథం నాయకత్వ లక్షణాలేనని ఆయన అభిమానులు, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కెనడా మాజీ ప్రధాని పియర్రీ ట్రుడో కుమారుడైన జస్టిన్ సాహిత్యంలో బీఏ, ఆ తర్వాత ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేసి.. ఫ్రెంచ్, మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశారు. అనంతరం ఇంజనీరింగ్ కూడా అభ్యసించారు. ఆ తర్వాత పర్యావరణ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు వివిధ సామాజిక, భద్రతా కార్యక్రమాల ప్రచారం కోసం ఉద్యమించారు. యుక్తవయసు నుంచే లిబరల్ పార్టీకి మద్దతునిచ్చిన జస్టిన్.. 2013లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 జస్టిన్ తాను స్త్రీవాది (ఫెమినిస్ట్)నని బహిరంగంగా ప్రకటించారు. తన తల్లి తనను స్త్రీవాదిగా పెంచారని.. ప్రతి ఒక్కరి హక్కులనూ గౌరవించే విలువలను తన తండ్రి నేర్పించారని జస్టిన్ ఒక చర్చలో పేర్కొన్నారు. వీడియోగేముల్లో, సాధారణ సాంస్కృతికలో మహిళలను చూపుతున్న విధానం పట్ల ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేయాలన్నారు. అబార్షన్ అనేది మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని.. మహిళల హక్కులకు లిబరల్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. కెనడా జనాభాలో కేవలం 4.3 శాతంగా ఉన్న ఆదివాసీ (మూలవాసులు) బాలికలు, మహిళలు.. దేశంలో హత్యా బాధితుల్లో 16 శాతంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. వారికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని ప్రకటించారు.

ఆదివాసీలతో సత్సంబంధాలు నెలకొల్పటానికి.. వారి విద్యాభివృద్ధికి, అదృశ్యమైన, హత్యకుగురైన ఆదివాసీ బాలికలు, మహిళల విషయంలో జాతీయ స్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తానని చెప్పారు. అలాగే.. 25 వేల మంది సిరియా శరణార్థులకు ఆశ్రయమిస్తామని ప్రకటించారు. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి అధునాతన సామాజిక సమాచార వ్యవస్థలతో నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండటమే కాదు.. ఎక్కడికి వెళ్లినా అక్కడి వారిలో ఒకడిగా కలిసిపోయి మెసలటం.. వారితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగటం వంటివి ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఒక మాజీ ప్రధాని కుమారుడే అయినా.. తనకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్న నేత జస్టిన్.

ఆయనను ఎందుకు అభిమానిస్తారనే దానిని ఒక యువ అభిమాని మాటల్లో చెప్తే.. ‘‘ఆయన ఒక స్త్రీవాది. మహిళలను ఆయన విశ్వసిస్తారు. పార్లమెంటులో స్త్రీ, పురుష సమానత్వం సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యతరగతిని రక్షించాలని కోరుకుంటారు. కెనడాలోని ఆదివాసీ ప్రజల పట్ల సానుకూలంగా, క్రియాశీలంగా వ్యవహరించాలని అనుకుంటారు. ఆయన యువకుడు.. ప్రస్తుత తరం అవసరాల గురించి పట్టించుకుంటారు. దానికి తోడు.. చక్కగా నాట్యం చేస్తారు.. అందగాడు.. ఇంకా ఏం చెప్పాలి?’’
 
 ఒబామా, మెద్వెదేవ్, కామెరాన్‌లూ నవతరమే...
 వీరేకాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘మార్పు’ నినాదంతో 2009 జనవరిలో తొలిసారి ఆ పదవిని చేపట్టినప్పుడు ఆయన వయసూ 39 ఏళ్లే. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ 2012లో వరుసగా రెండోసారీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు కాకముందు పౌర హక్కులపై ప్రభుత్వ న్యాయవాదిగా, చికాగోలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2004లో సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

►ఇక రష్యా ప్రస్తుత ప్రధానమంత్రి దిమిత్రీమెద్వెదేవ్.. 2008లో మూడో దేశాధ్యక్షుడిగా ఎన్నికైనపుడు ఆయన వయసూ 42 సంవత్సరాలే. రష్యా అధ్యక్షులందరిలో అతి పిన్న వయస్కుడు. యునెటైడ్ రష్యా పార్టీ నేత అయిన మెద్వెదేవ్, ప్రస్తుత దేశాధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్‌లు స్నేహితులు.
►యునెటైడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ 2010లో తొలిసారి ఆ పదవిని చేపట్టినపుడు ఆయన వయసు 46 సంవత్సరాలు. 2001లో ఎంపీగా గెలిచిన ఆయన 2005 నుంచి కన్సర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
 
 పోలండ్: ఆంద్రెజ్ సెబాస్టియన్ డుడా
 పోలండ్ రాష్ట్రపతిగా ఆంద్రెజ్ సెబాస్టియన్ డుడా ఈ ఏడాది ఆగస్టులో ఎన్నికయ్యారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. అంతకుముందు న్యాయవాదిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న డుడా.. లా అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
 
 గ్రీస్‌లో సిప్రాస్‌కు పట్టం
 ఏడాది వ్యవధిలో రెండోసారి గ్రీస్ ప్రధానిగా ఎన్నికైన అలెక్సిస్ సిప్రాస్ కూడా నవతరం ప్రతినిధే. ఆయన వయసు 41 ఏళ్లే. 2009 నుంచి వామపక్ష సిరిజా పార్టీ నేతగా ఉన్న అలెక్సిస్.. ఈ ఏడాది జనవరిలో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే.. గ్రీస్ రుణాలను సకాలంలో తీర్చకపోవటంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. దాని నుంచి బయటపడేందుకు ప్రజలపై పన్నుల భారం మోపాలన్న షరతులను నిరాకరించి ప్రజలపక్షానే ప్రభుత్వం ఉండాలన్న తన నిబద్ధతను చాటుకున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల మద్దతు తగ్గటంతో ఆగస్టులో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
 
 చెక్ రిపబ్లిక్: బొహుస్లావ్ సొబొట్కా
 చెక్ రిపబ్లిక్ ప్రధానిగా వామపక్ష నేత బొహుస్లావ్ సొబొట్కా 2014 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. 44 ఏళ్ల సొబొట్కా 2011 నుంచి సోషల్ డెమొక్రటిక్ పార్టీ చైర్మన్‌గా ఉన్నారు. అంతకుముందు 2002-2006 మధ్య ఆర్థికమంత్రిగా కూడా పనిచేశారు. వెల్వెట్ విప్లవం కారణంగా అధికారం కోల్పోయిన 24 ఏళ్ల తర్వాత వామపక్ష పార్టీ సొబొట్కా సారథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. దేశంలో ఆర్థికవ్యవస్థ ఇబ్బందుల్లో పడటం.. ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యలు, పన్నుల భారం వంటి వాటితో పాటు.. అవినీతి ఆరోపణలు పెరిగిపోయిన పరిస్థితుల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీని మళ్లీ ముందుకు తీసుకురావటంలో సొబొట్కా విజయం సాధించారు.
 
 బెల్జియం: చార్లెస్ మైఖేల్
 బెల్జియం ప్రధానిగా 39 ఏళ్ల చార్లెస్ మైఖేల్ 2014 అక్టోబర్‌లో ఎన్నికయ్యారు. చార్లెస్ 2011లో లిబరల్ పార్టీ మూవ్‌మెంట్ రిఫార్మేటర్ పగ్గాలు చేపట్టారు. పాతికేళ్ల వయసుకే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఏ పార్టీకీ మెజారిటీ రాని సందర్భంలో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కష్టపడి పనిచేసే తత్వం, శాంతంగా ఉండటంతో పాటు.. రాజకీయ వ్యూహం ఆయనను గెలిపించాయి. ఫ్రెంచి భాష మాట్లాడేవారు. ఫ్లెమిష్ భాష మాట్లాడేవారి మధ్య విభేదాలు దేశంలో ఫ్రెంచి భాషస్తుడైన మైఖేల్ ఫ్లెమిష్ కూడా మాట్లాడగలగటం వల్ల.. ఇరు భాషల వారి మధ్య వారధిగా మారారని అభివర్ణిస్తున్నారు.
 
 ఐస్‌ల్యాండ్: సిగ్మండూర్ తావియో కున్లాయిక్సన్
 ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రిగా 2013 మేలో సిగ్మండూర్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. ఆయన 2009 నుంచి ప్రోగ్రెసివ్ పార్టీ చైర్మన్‌గా ఉన్నారు. 2013 ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ లభించని పరిస్థితుల్లో ఇండిపెండెన్స్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement