
పప్పుల నిల్వలపై పరిమితి
బడా రిటైలర్లు, ఎగుమతి-దిగుమతిదారులు, ప్రాసెసింగ్ సంస్థలకు వర్తింపు
న్యూఢిల్లీ: కందిపప్పు, మినప్పప్పు వంటి పప్పుధాన్యాల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో వాటి సరఫరాను మెరుగుపరచడంతోపాటు అక్రమ నిల్వలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లెసైన్సుగల ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, పప్పుధాన్యాల ఎగుమతి, దిగుమతిదారులు, బిగ్ బజార్ వంటి పెద్ద రిటైల్ స్టోర్లు పప్పుధాన్యాలను అధికంగా నిల్వ ఉంచుకోకుండా పరిమితి విధించింది. అలాగే వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిత్యం వాటి ధరల పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపింది.
దేశంలో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు, మరికొన్ని కోట్ల అకాల వర్షాల వల్ల 2014-15 పంట కాలానికి పప్పుధాన్యాల ఉత్పత్తి సుమారు 20 లక్షల టన్నులు తగ్గడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గతేడాది కిలో రూ. 85 చొప్పున పలికిన కందిపప్పు ధర ఈ ఏడాది ఏకంగా కిలోకు రూ. 190 వరకు చేరింది. అలాగే మినప్పప్పు ధర సైతం గతేడాది కిలో రూ. 100 చొప్పున నుంచి ఈ ఏడాది కిలో రూ. 190కి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం రైతుల నుంచి మార్కెట్ ధరకు 40 వేల టన్నుల పప్పుధాన్యాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచాలని గత వారం నిర్ణయించింది. తాజాగా 5 వేల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకున్న ప్రభుత్వం మరో 2 వేల టన్నుల దిగుమతులకు టెండర్లు పిలిచింది.