ఛోటా తరలింపు వాయిదా
బాలిలో అగ్నిపర్వతం విస్ఫోటనంతో విమానాశ్రయం మూసివేత
బాలి: ఇండోనేసియాలోని బాలిలో పట్టుబడ్డ ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను భారత్‌కు తరలించే కార్యక్రమం మరో రోజు వాయిదా పడింది. బాలి సమీపంలోని రింజని అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బూడిద మేఘాలు ఆవరించటంతో విమాన రాకపోకలకు అవకాశం లేనందున మంగళవారం రాత్రి బాలి విమానాశ్రయాన్ని మూసేయడం తెలిసిందే. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూసివేతను బుధవారమూ పొడిగించారు. గురువారం ఉదయం వరకూ ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరే అవకాశం లేదని అధికారులు చెప్పినట్లు భారత పోలీసు బృందానికి చెందిన అధికారులు తెలిపారు. ఫలితంగా గురువారం ఉదయం వరకూ ఛోటా రాజన్ తరలింపు వాయిదా పడినట్లేననన్నారు.
నేరుగా ఢిల్లీకి తరలింపు..
రాజన్‌ను బాలి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకువచ్చి.. తొలుత సీబీఐ కస్టడీలో ఉంచాలని భద్రతా సంస్థలు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతడిని ఇండోనేసియా నుంచి నేరుగా ముంబై తీసుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. రాజన్ ప్రాణాలకు ముప్పుండంతో అతడిని వెంటనే ముంబై పోలీసులకు అప్పగించటానికి కేంద్రం విముఖత చూపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రాజన్‌ను బాలి నుంచి ముంబైకి తీసుకువస్తామని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. అతడిని ముంబై పోలీసుల కస్టడీకి అప్పగించే విషయమై కేంద్రంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.