రాజన్‌ను తీసుకురావటంలో సమస్య లేదు: కేంద్రం
ఇండోనేసియాతో చర్చిస్తున్నాం
♦ రెండ్రోజుల్లో బాలీకి సీబీఐ అధికారులు
♦ రెండు, మూడు ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు
న్యూఢిల్లీ/జకార్తా: ఇండోనేసియాలో అరెస్ట్ అయిన అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్(55)ను భారత్‌కు తీసుకురావటంలో చట్టపరమైన సమస్యలేమీ ఉండబోవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ దిశగా ఇండోనేసియా అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రెండుదేశాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నందున.. సీబీఐ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. కాగా, ఛోటా రాజన్ అప్పగింతపై ఇబ్బందులు ఉండకపోవచ్చని ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ చెప్పారు. భారత అధికారులు జారీచేసిన నోటీసుపైనే చోటా రాజన్‌ను అరెస్ట్‌చేసినందున అతడి అప్పగింత విషయంలో ఇబ్బందులు తలెత్తవన్నారు. ‘‘ఇండోనేసియాతో నేరస్తుల అప్పగింత ఒప్పందంతోపాటు పరస్పర న్యాయ సహకార ఒడంబడిక ఉంది.
ఈ కేసుతోపాటు ఇతర కేసుల్లోనూ ఇవి వర్తిస్తాయని భావిస్తున్నాం. రాజన్ అప్పగింత విషయంలో ఏ ఇతర లీగల్ డాక్యుమెంట్ అవసరమవుతుందని నేను అనుకోను’ అని గుర్జిత్ సింగ్ అన్నారు. అయితే.. దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్‌కు ప్రాణహాని ఉన్నందున.. అతణ్ణి క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజన్‌పై ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉన్నందున తమ పోలీసులకు అప్పగించేలా సీబీఐని కోరతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. రాజన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు రెండ్రోజుల్లో సీబీఐ అధికారులు బాలీ వెళ్లే అవకాశం ఉంది.