
'అజెండాలో ఉన్నాయి.. కానీ పాలన ఫస్ట్'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే నిబంధన 370 రద్దు అంశాలు తమ అజెండాలోనే ఉన్నాయని, అయితే, ప్రస్తుతం తమ దృష్టంతా పరిపాలన మీదే ఉందని బీజేపీ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. దేశానికి అత్యుత్తమ పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో పయనించేలా చేయడమే ప్రస్తుతం మోదీ సర్కార్ లక్ష్యం అని చెప్పారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రామమందిరం, 370 నిబంధన అంశాలను ఇప్పటికే తాను రాజ్యసభలో ప్రస్తావించానని గుర్తుచేశారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిందని, ఇక వెనుకకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు ఈ అంశాలను పలు రాజకీయ పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందని, చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.