సుబ్రహ్మణ్య స్వామి కొత్త టార్గెట్స్ ఇవే!
న్యూఢిల్లీ: ట్విట్టర్‌లో వరుస విమర్శలు చేస్తూ సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా పంథా మార్చారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై నేరుగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా స్వామి చేసిన ఆరోపణలు బీజేపీలో గగ్గోలు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు.
ఈ నేపథ్యంలో ఒక వారంపాటు ట్విట్టర్‌కు కొంత దూరంగా ఉంటానని స్వామి తాజాగా ప్రకటించారు. ఈ వారం రోజుల్లో అయోధ్యలో రామాలయం, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ ప్రమేయమున్న నేషనల్ హెరాల్డ్, ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులపై దృష్టి పెడుతానని ఆయన తెలిపారు. అదేసమయంలో భారత జీడీపీ మీద ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాలను ఒకింత విస్మయపరిచింది. భారత జీడీపీ గణన, ఆర్బీఐ వడ్డీ రేట్లపై సామ్యూల్‌సన్-స్వామి థీయరీ వర్తింపజేసి విశ్లేషిస్తే.. అది పార్టీ వ్యతిరేక చర్య అంటూ మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయం కేసు, నేషనల్ హెరాల్డ్, ఎయిర్‌సెల్ మాక్సిస్ , సీఎస్‌కే తదితర కేసులపై దృష్టి పెడుతున్నందున ట్విట్టర్‌లో పెద్దగా కనిపించకపోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు.