ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 25న బెల్జియంలోని బ్రసెల్స్ పర్యటనకు వెళుతారని వెట్‌హౌస్ ప్రకటించింది. ఇదే ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన అయ్యే అవకాశముంది. అయితే, ఇది దౌత్యపర్యటన కాదు. బ్రసెల్స్‌లో జరగనున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దేశాధినేతల సమావేశంలో ట్రంప్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం గురించి నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టన్‌బర్గ్ మంగళవారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో నాటోతో అమెరికాకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, ఈ కూటమికి సంబంధించిన కీలకాంశాలను చర్చించేందుకు, ఉగ్రవాదంపై పోరాటం సహా పలు అంశాలలో నాటో ఉమ్మడి పోరాటం, బాధ్యతలను పెంపొందించేందుకు నాటో దేశాధినేతల సమావేశంలో పాల్గొనాలని ట్రంప్ నిర్ణయించినట్టు ఆయన ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. నాటో చెల్లనికాసులాగా మారిపోయిందని, బ్రసెల్స్ జీవించడానికి వీలుకాని నరకంలా మారిందని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే.