వాళ్లు వచ్చింది దోపిడీ కోసమే
జూబ్లీహిల్స్లో కాల్పులు జరిగిన ఘటనా స్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్లో దోపిడీ చేయడానికే రెండు రోజుల క్రితం ఫహీం, ఖాదిర్ గుల్బర్గా నుంచి వచ్చారని ఆయన తెలిపారు. గుల్బర్గా నుంచి వచ్చిన ఇద్దరికీ హైదరాబాద్ వాసి ఒకరు షెల్టర్ ఇచ్చారన్నారు. దోపిడీ ముఠా కదలికలను టాస్క్ఫోర్స్ ఎప్పటికప్పుడు గమనిస్తోందని, అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నీరూస్ వద్ద వారిని పట్టుకోడానికి టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారని మహేందర్ రెడ్డి చెప్పారు. అప్పుడే ఆ ఇద్దరిలో ఒకరు నాటు తుపాకితో ఫైరింగ్ చేశారని, ఆ కాల్పుల్లో మెట్రో కార్మికుడు ధర్మేందర్ సింగ్కు గాయాలయ్యాయని తెలిపారు.
ఇద్దరినీ తాము పట్టుకున్నామని, వారి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకే వాళ్లు హైదరాబాద్ వచ్చినట్లు తమకు చిన్న క్లూ లభించిందని తెలిపారు. దాని ఆధారంగానే టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు రోజుల నుంచి ఆపరేషన్ నిర్వహించారని, అత్యంత ధైర్య సాహసాలతో తమ సిబ్బంది వాళ్లను పట్టుకున్నారని చెప్పారు. వీళ్లు దోపిడీ కోసమే వచ్చినట్లు తెలుస్తున్నా.. ఉగ్రవాద కోణం కూడా ఏమైనా ఉందేమోనని విచారిస్తున్నట్లు చెప్పారు.