jubilee hills firing
-
కానిస్టేబుల్ వైపే కాల్పులు!
జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలో సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సాక్షి టీవీ చేతికి అందిన సీసీటీవీ ఫుటేజి వీడియోలో మరో విషయం బయటపడింది. ఆ రోజు.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జీపులో వెంబడించి, దుండగుల పల్సర్ బైకును ఢీకొట్టినప్పుడు ఆ బైకు పడిపోయింది. దాంతో వెనక ఉన్న ఫహీం తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి.. పట్టుకోడానికి వస్తున్న కానిస్టేబుల్ వైపు కాల్చాడు. అయితే, సమయానికి కానిస్టేబుల్ పక్కకు వంగడంతో.. ఆ బుల్లెట్ వెళ్లి, అక్కడ మెట్రోపనులు నిర్వహిస్తున్న ధర్మేందర్ సింగ్ అనే కానిస్టేబుల్‌కు తగిలింది. దోపిడీ చేయడానికే కర్ణాటకకు చెందిన ముఠాలోని ముగ్గురు సభ్యులు వచ్చారని తొలుత భావించినా.. చివరకు బిగ్ సీ కంపెనీలో పనిచేసే మేనేజరే ఈ మొత్తం పథకానికి సూత్రధారి అని తర్వాత తెలిసిన విషయం తెలిసిందే. -
వాళ్లు వచ్చింది దోపిడీ కోసమే
జూబ్లీహిల్స్‌లో కాల్పులు జరిగిన ఘటనా స్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్‌లో దోపిడీ చేయడానికే రెండు రోజుల క్రితం ఫహీం, ఖాదిర్ గుల్బర్గా నుంచి వచ్చారని ఆయన తెలిపారు. గుల్బర్గా నుంచి వచ్చిన ఇద్దరికీ హైదరాబాద్ వాసి ఒకరు షెల్టర్ ఇచ్చారన్నారు. దోపిడీ ముఠా కదలికలను టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు గమనిస్తోందని, అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నీరూస్ వద్ద వారిని పట్టుకోడానికి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారని మహేందర్ రెడ్డి చెప్పారు. అప్పుడే ఆ ఇద్దరిలో ఒకరు నాటు తుపాకితో ఫైరింగ్ చేశారని, ఆ కాల్పుల్లో మెట్రో కార్మికుడు ధర్మేందర్ సింగ్‌కు గాయాలయ్యాయని తెలిపారు. ఇద్దరినీ తాము పట్టుకున్నామని, వారి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకే వాళ్లు హైదరాబాద్ వచ్చినట్లు తమకు చిన్న క్లూ లభించిందని తెలిపారు. దాని ఆధారంగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల నుంచి ఆపరేషన్ నిర్వహించారని, అత్యంత ధైర్య సాహసాలతో తమ సిబ్బంది వాళ్లను పట్టుకున్నారని చెప్పారు. వీళ్లు దోపిడీ కోసమే వచ్చినట్లు తెలుస్తున్నా.. ఉగ్రవాద కోణం కూడా ఏమైనా ఉందేమోనని విచారిస్తున్నట్లు చెప్పారు. -
ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..!
జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనకు సంబంధించిన మొత్తం సమాచారం అంతా వెలుగులోకి వస్తోంది. ఒక్క వ్యక్తిని పట్టుకుని.. అతడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ అంతా జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బ్యాంకు దోపిడీ ముఠాలో ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫహీం, అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరినీ జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించారు. ఈ విషయాన్ని గుర్తించిన కర్ణాటక గ్యాంగు.. కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లోనే ఎల్అండ్టీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాళ్ల వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో బ్యాంకు దోపిడీలకు పాల్పడే ఈ ముఠా.. హైదరాబాద్‌లో ఓ మొబైల్ వ్యాపార సంస్థకు చెందిన మేనేజర్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.