అమెరికాలో ముగ్గురి దుర్మరణం
-
వారిలో ఒకరు హైదరాబాదీ, మరొకరు కర్నూలు వాసి
-
వర్జీనియాలో డివైడర్‌ను కారు ఢీకొని ప్రమాదం
హైదరాబాద్/నంద్యాల,న్యూస్‌లైన్: అమెరికాలోని వర్జీనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రాష్ట్రవాసులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లోని మధురానగర్‌కు చెందిన శరత్(25), కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోకా మల్లికార్జున(24) ఉన్నారు.
ఈ ప్రమాదంలో వీరితోపాటు చెన్నైకి చెందిన జిగ్నేష్ అనే వ్యక్తి కూడా మృతి చెందారు. ప్రమాదం సమాచారాన్ని వర్జీనియా పోలీసులు బుధవారం మల్లికార్జున సోదరుడు శ్రీనివాసులుకు అందజేశారు. ఆపిల్ కంపెనీలో పనిచేస్తున్న మల్లికార్జున తన మిత్రులు శరత్, జిగ్నేష్‌లతో కలసి సోమవారం రాత్రి విధులు ముగించుకొని కారులో బయల్దేరారు. మార్గమధ్యలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు.
ఆగి ఉన్న లారీని తప్పించబోయే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగిందని శ్రీనివాసులు చెప్పారు. 17న మల్లికార్జున మృతదేహం నంద్యాలకు చేరుతుందన్నారు. శరత్ తల్లిదండ్రులు సుదర్శనం ఉదయ్‌కుమార్, ప్రసూన. అతను గత జనవరిలో వర్జీనియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరాడు. అక్కడ మల్లికార్జున, జిగ్నేష్‌లతో కలసి ఉంటున్నాడు.