ఫేస్బుక్ లైవ్ వీడియోలో కాల్పుల కలకలం
న్యూయార్క్: ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ సందర్భంగా అమెరికాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తరహా ప్రమాద ఘటనలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా వర్జీనియాలో స్వంత షూటింగ్ రికార్డింగ్ లో కాల్పుల ఉదంతం రికార్డయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వర్జీనియా లోని నార్ ఫోక్ , పరిసరాల్లోని బర్క్లీ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళితే...టీజే విలియమ్స్ అతని ఇద్దరు స్నేహితులతో కారులో వెడుతూ హిప్ హాప్ సంగీతం వింటూ.. వీడియోను రికార్డు చేస్తున్నారు. ఇంతలో తుపాకీల మోత. దాదాపు ఇరవై సార్లు తుపాకీ గుళ్ల మోత వినిపించింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం ఫోన్ ఎగిరి కిందపడడం...క్షణాల్లో జరిగిపోయింది. ఈ కాల్పుల ఘటనను నార్ ఫోక్ పోలీసులు ధృవీకరించారు. బాధితులను సెంటారా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోఉన్నారని, మరొకరికి స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడని వెల్లడించారు.
కాగా సీబీఎస్ న్యూస్ ప్రకారం, చికాగోలో ఇలాంటి మూడు ఘటనలు నమోదయ్యాయి. ఆంటోనియో పెర్కిన్స్ అనే వ్యక్తి ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియో చిత్రీకరిస్తుడగా.. ఓ గ్యాంగ్ కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. రెండవ ఘటనలో మరోవ్యక్తి కాల్పులకు బలయ్యాడు. ఈ ఏడాది మార్చి లో జరిగిన మూడవ ఘటనలో ఓవ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.