
ఉంటావా.. వెళతావా?
♦ మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టీపీసీసీ అల్టిమేటం
♦ అనుయాయులతో నేడు నాగేందర్ ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ అంశంపై ఏదో ఒకటి తేల్చే దిశగా టీపీసీసీ పావులు కదిపింది. నగర అధ్యక్షునిగా ఉంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సైతం అసహనం వ్యక్తం చేస్తూ, రెండుమూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలని టీపీసీసీని ఆదేశించినట్లు తెలిసింది.
ఈ మేరకు టీపీసీసీ బుధవారం నాగేందర్‌కు ఒక లేఖను పంపింది. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అందులో పార్టీలో కొనసాగుతారా, లేదా అన్న విషయమై వెంటనే తేల్చాలని ఆదేశించినట్లు సమాచారం.
నేడు అనుచరులతో దానం భేటీ
మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం గురువారం తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ అంశాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.