ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నేతల రగడ
హైదరాబాద్: అంతర్గత ప్రజాస్వామ్యం అతిగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు అందుకు వేదికయింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మోహరించిన ఇరు వర్గాలు.. డిగ్గీ విమానం దిగీదిగగానే వాగ్వాదాలతో స్వాగతం పలికారు. డిగ్గీ ముందే.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహనర్ రెడ్డిలు తీవ్రస్థాయిలో తగువులాడుకున్నారు.
వివాదం ఎలా మొదలైందంటే.. జీహెచ్సీసీ అధ్యక్షుడైన దానం.. రంగారెడ్డి అర్బన్ జిల్లా వ్యవహారాలను కూడా తన ఆధీనంలోనే ఉండాలని, ఆమేరకు ఉత్తర్వులు ఇవ్వాలని గతంలో పార్టీ హైకమాండ్ ను కోరారు. అయితే రంగారెడ్డి అర్బన్ నాయకులు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. దానం కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు మాత్రమే అధ్యక్షుడని, తమ పరిధిలో ఆయన పెత్తనం సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మరో అడుగు ముందుకేసి.. అధిష్టానం నుంచి లిఖిత పూర్వకహామీ కూడా తెచ్చుకున్నారు.
సోమవారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ ముందు మరోసారి ఇదే అంశంపై దానం, రంగారెడ్డి అర్బన్ నేతలు పోట్లాడుకున్నారు. అర్బన్ హక్కులు తనకే కావలని దానం.. అది కుదరదని ఎమ్మెల్యే రాంమోహన్ కీచులాడుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే మరణించిన టీడీపీ ఎమ్మల్సీ మస్కతీ ఇంటికి కాంగ్రెస్ హైకమాండ్ నేతలు వెళ్లడంపై ఎంపీ వి. హనుమంతరావు తప్పుపట్టారు. వీహెచ్ వాదనతో మరోనేత షబ్బీర్ అలీ విభేధించారు. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ ఒక మైనారిటీ నేత కుటుంబాన్ని పరామర్శించడం తప్పుకాదన్నారు.