పారిశ్రామికవేత్తలతో ప్రధాని: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఢిల్లీ వేదికగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది.
సీడబ్ల్యూసీ భేటీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి కమిటీగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. పార్టీ జాతీయ కార్యాలయంలో జరగబోయే భేటీలో సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం పొడగింపు, మోదీ పాలన సహా పలు సంస్థాగత విషయాలపై చర్చిస్తారని తెలిసింది.
రాజ్నాథ్ రాక: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగే జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
చైనాలో కేసీఆర్: చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు తన బృందంతో కలిసి దనియల్ పట్టణాన్ని సందదర్శిస్తారు. సాయంత్రం భారత వాణిజ్య, వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు.
రెండోరోజు షర్మిల పరామర్శయాత్ర: వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించిన వరంగల్ జిల్లా వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర రెండోరోజూ కొనసాగనుంది.
ఏపీలో వర్సిటీల బంద్: బాబు సర్కారు ప్రవేశపెట్టిన ప్రైవేటు వర్సిటీల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సోమవారం అన్ని యూనివర్సిటీల బంద్ నిర్వహిస్తున్నది.
ఫిర్యాదుల పర్వం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్ధానాన్ని విస్మరించిందంటూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేడు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించనుంది.
డైట్ సెట్ ఫలితాలు: ఏపీ డైట్ సెట్- 2015 పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
సర్టిఫికెట్ల పరిశీలన: తెలంగాణలో నిర్వహించిన డీఈఈ సెట్ పరీక్షల్లో అర్హతసాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను నేడు పరిశీలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్రయం: తెలంగాణలోని 859 కంప్యూటరైజ్డ్ పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్రయం నేటి నుంచి ప్రారంభంకానుంది.
తిరుమల: బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు తిరుమలలో కోయల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఉదయం 11 గంటల తర్వాతే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది.
నేడు కూడా వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం: అమెరికాలోని లాస్వెగాస్ వేదికగా సోమవారం నుంచి వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి.