అమరావతి భూములు ప్రైవేట్ సంస్థలకు: ఆదివారం విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. రాజధాని ప్రాంత భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కీలకమైన బిల్లుకు సోమవారం సభ ఆమోదం తెలపనుంది. ఈ బిల్లును ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు కూడా నేడే ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
3 రోజులు.. 18 బిల్లులు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సోమవారం(నేటి)తో కలిపి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో పెండింగ్ లో ఉన్న 18 కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.
అసహనం, ఢిల్లీ సీఎం ఆఫీసులో సీబీఐ తనిఖీలు, నేషనల్ హెరాల్డ్ అంశాలపై చెలరేగిన ఆందోళనలతో సభాకార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో సోమవారం నుంచైనా సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు పార్టమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మూడు రోజులు సభ సజావుగా జరిగితే జాతీయ జలమార్గాలు, నేపాల్ తో సంబంధాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ సీఎంపై పరువునష్టం దావా: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో తనతోపాటు తన కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఆ మేరకు కేజ్రీవాల్ పై నేడు పరువునష్టం దావా వేయనున్నారు. పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ కేసు, ఢిల్లీ హైకోర్టులో సివిల్ కేసులు దాఖలు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ముందస్తు నోటీసులు లేకుండా కేసులెలా పెడతారంటూ ఆప్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఫాం హౌస్ కు కేసీఆర్: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు నేడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. నేటి నుంచి చండీ యాగం పూర్తయ్యేంత వరకు ఆయన అక్కడే ఉంటారు. సీఎం కేసీఆర్ ఈ నెల 23 నుంచి 27 వరకు ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే.
భక్త వైకుంఠం: నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, భద్రాద్రి, యాదాద్రి ఆలయాల్లో ఉత్తరద్వారం ద్వారా స్వామివార్లు దర్శనం దర్శనమిచ్చారు. తిరుమల మాఢావీధుల్లో ఉదయం 9గంటలకు స్వర్ణ రధంపై శ్రీవారు ఊరేగనున్నారు.
బాలనేరస్తుడి విడుదల: ప్రపంచవ్యాప్తంగా సంచనం సృష్టించిన నిర్భయ కేసులో శిక్షపూర్తిచేసుకున్న బాలనేరస్తుడు ఆదివారం విడుదలయ్యాడు. అతడి విడుదలపై ఢిల్లీ మహిళా కమిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.