ముందు మరుగుదోడ్లు.. ఆతర్వాతే దేవాలయాలు!
తొలి ప్రాధాన్యతగా టాయిలెట్లను నిర్మించాలని.. ఆతర్వాత ఆలయాల నిర్మాణాలను చేపట్టాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. హిందుత్వ నాయకుడి ముద్రను తొలగించుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారనే వాదనకు ఈ సంఘటనను ఉదహరణగా చెప్పవచ్చు.
దేశ రాజధాని న్యూఢిల్లీ లో యువత కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. 'హిందుత్వ నాయకుడిగా తనకు పేరుంది. అయితే తాను ఉద్దేశం చెప్పడానికి తనకున్న ఇమేజ్ అడ్డంకిగా మారినా.. తాను ధైర్యంగా ఓ విషయాన్ని చెప్పడానికి ముందుకు వస్తాను. తొలి ప్రాధాన్యతగా మరుగుదొడ్లు నిర్మించాలి. ఆ తర్వాతే దేవాలయాలను నిర్మించండి' అని అన్నారు. గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఆలయాలను నిర్మిస్తున్నారని.. అయితే కనీస మరుగుదొడ్ల వసతి కరువైందని, దాని వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని ఆయన అన్నారు.
తాజాగా మరుగుదొడ్లపై మోడీ చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీ, అనుబంధ సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. గతంలో మరుగుదొడ్లపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాల, ఇతర సంస్థల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.