గడ్డం బాబాపై దిగ్విజయ్ సింగ్ విసుర్లు!
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. 'ముందు టాయిలెట్స్.. ఆతర్వాతే దేవాలయాలు' అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ తప్పుపట్టారు. బీజేపీ నేతల మాటలకు, చేతలకు ఉన్న వ్యత్యాసంపై దిగ్విజయ్ ఎత్తి చూపారు. మధ్య ప్రదేశ్ లోని మండలేశ్వర్ లో కాంగ్రెస్ సత్తా పరివర్తన్ ర్యాలీలో మాట్లాడుతూ... మోడీని 'గడ్డం బాబా (దాడివాలే బాబా)' అని వ్యాఖ్యానించారు.
గతంలో ఆయన ప్రాధాన్యత ఆలయాల నుంచి టాయిలెట్లకు మారిపోయిందని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎటువంటి అభివృద్ధి జరుగలేదని చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. నవంబర్ లో జరిగే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 51 వేల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.