టయోటా కంపెనీ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది.
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఈ నెల 21 నుంచి కొన్ని మోడళ్ల కార్ల ధరలను 1.5% (రూ.24,000) వరకూ పెంచుతున్నామని కంపెనీ మంగళవారం తెలిపింది. పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, తరిగిపోతున్న రూపాయి విలువ కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఇటియోస్, ఇటియోస్ లివా, ఇన్నోవా, కొరొల్లా ఆల్టిస్ ధరలను పెంచుతున్నామని వివరించింది.
రూ.9.77 లక్షలు-రూ.14.42 లక్షల రేంజ్‌లో ఉన్న ఇన్నోవా ధరలను రూ.7,000 నుంచి రూ.11,000వరకూ, రూ.11.74 లక్షలు-రూ.15.89 లక్షల రేంజ్‌లో ఉన్న కొరొల్లా ఆల్టిస్ ధరలను రూ.11,000 నుంచి రూ.24,000 వరకూ, రూ.5.45 లక్షల నుంచి రూ.8.15 లక్షల రేంజ్‌లో ఉన్న ఇటియోస్ ధరలను రూ.4,000 నుంచి రూ.8,000 వరకూ, రూ.4.46 లక్షల నుంచి రూ.6.59 లక్షల రేంజ్‌లో ఉన్న ఇటియోస్ లివా ధరలను రూ.4,500 నుంచి రూ.8,600 వరకూ పెంచుతున్నామని పేర్కొంది. రూపాయి పతనం కారణంగా ఇప్పటికే ఫోర్డ్ ఇండియా, మెర్సిడెస్-బెంజ్, జనరల్ మోటార్స్ ఇండియా, బీఎండబ్ల్యూ గ్రూప్, ఆడి కంపెనీలు కూడా ధరలు పెంచాయి.