35కి చేరిన బీహార్ రైలు ప్రమాద మృతుల సంఖ్య
పాట్నా : బీహార్ రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 35కి పెరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ సోమవారం తెల్లవారుజామున భమారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను లాగి కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు.
బాధితుల్లో చాలామంది కన్వారియాలు (శివభక్తులు). వీరంతా పట్టాల మీద నిలబడి ఆందోలన చేస్తు ఉండగా, రాజ్యరాణి ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. దుర్ఘటన జరిగిన తర్వాత కొంత దూరం వెళ్లి రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
కాగా రాజ్యమణి ఎక్స్ప్రెస్కు ధమారా రైల్వేస్టేషన్లో హాల్ట్ లేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే రైలును ఆపేందుకు ప్రయాణికులు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో 35మంది దుర్మరణం చెందినట్లు కజారియా లోక్సభ ఎంపీ దినేష్ చంద్ర యాదవ్ వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.