సీఎంను బర్తరఫ్ చేయాలి: టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు వ్యతిరేకంగా, సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశం తరువాత టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదీనని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్ పుట్టిన గడ్డకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించాలనుకుంటే ఆ పార్టీ దయతో వచ్చిన ముఖ్యమంత్రి పదవి నుంచి తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకి అయిన సీఎం కిరణ్ కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు ఇంకా ఎందుకుంటారో ప్రశ్నించుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు టి.హరీష్‌రావు, కేటీఆర్, ఏనుగురవీందర్ రెడ్డి హాజరుకాలేదు.
పదవికి కిరణ్ అనర్హుడు : విద్యావంతుల వేదిక
ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. పార్టీ విధానాన్ని, రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యా విలువలను పట్టించుకోని వ్యక్తిగా కిరణ్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరిం చారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీఎంను బర్తరఫ్ చేయాలని మల్లేపల్లి డిమాండ్ చేశారు.
కిరణ్ దిష్టిబొమ్మల దహనం : టీఆర్‌ఎస్‌వీ పిలుపు
తెలంగాణకు వ్యతిరే కంగా, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను శుక్రవారం దహనం చేయాలని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపును ఇచ్చారు. విద్యార్థులంతా పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలని కోరారు.
సీల్డుకవర్ సీఎంకేం తెలుసు?: కేటీఆర్
ప్రజలతో సంబంధం లేకుండా సీల్డుకవరులో వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కు ప్రజల మనోభావాలు ఏం తెలుస్తాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్న కిరణ్ తీరుపై తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని సూచించారు. అధిష్టాన నిర్ణయాన్ని తప్పుబట్టిన కిరణ్ తక్షణమే పదవి నుంచి వైదొలగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దున్నపోతుకు సున్నమేస్తే ఎద్దు కాదని మరోసారి స్పష్టమైందని ఎద్దేవా చేశారు.
సీఎం తెలంగాణ వ్యతిరేకి: రవి
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపు నిచ్చారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. సీమాంధ్రకే సీఎం అని ఆయన వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు.